తిరుపతి 'సీమ' ర్యాలీలో షాకింగ్ సీన్.. జై అమరావతి

Update: 2021-12-17 03:19 GMT
రాజకీయం రంగు.. రూపం.. రుచి పూర్తిగా మారిపోయాయి. మార్పు మామూలే అయినా.. మరీ ఇంత వికృతంగా.. ఛండలాంగా మాత్రం గతంలో ఎప్పుడూ చూసింది లేదు. రాజకీయంగా తమకు నచ్చని అంశాలు చోటు చేసుకుంటున్నప్పుడు కౌంటర్లు ఇవ్వటం సహజం. అందుకు భిన్నంగా అడ్డదిడ్డంగా వ్యవహరిస్తూ అధికారాన్ని అసరగా చేసుకొని తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం ఏ మాత్రం సరికాదు.

తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించి.. అభాసుపాలైన ఉదంతం రాయలసీమ మేధావుల ఫోరం గురువారం తిరుపతిలో నిర్వహించిన ర్యాలీతో స్పష్టమైంది.

ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశంలో మూడు రాజధానులు ముద్దు.. అమరావతి వద్దు. ఎప్పుడూ లేనిది ఉన్నట్లుండి రాయలసీమ మేధావుల ఫోరం ఇంత చురుగ్గా ఎందుకు ర్యాలీని నిర్వహించాలన్న నిర్ణయం తీసుకుందంటే.. సుదీర్ఘ పాదయాత్రను ముగించుకున్న అమరావతి రైతుల సభ శుక్రవారం తిరుపతిలో జరగనుంది. ఇలాంటి వేళ.. అమరావతి రైతులకు తిరుపతిలో ఎలాంటి సానుకూలత లేదన్న విషయాన్ని చాటి చెప్పాలన్న రాజకీయ నేతల ఆలోచనకు ప్రతిరూపంగా ఈ ర్యాలీ జరిగిందని చెబుతున్నారు.

ఇలాంటి మాట చెప్పినంతనే.. కావాలనే బురద జల్లుతున్నారని.. పచ్చ మీడియా అంటూ ట్యాగులు కట్టేయటం ఖాయం. అయితే.. ర్యాలీలో హాజరైన భారీ జన సందోహంలో ఎక్కువమంది కుర్రాళ్లు రావటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కాలేజీకి వెళ్లే పిల్లలు ర్యాలీలో కనిపించటం ఏమిటి చెప్మా? అన్న సందేహానికి సమాధానంగా కొందరు కుర్రాళ్లను ఒక టీవీ చానల్ ప్రశ్నించింది. వారు చెప్పిన సమాధానం విన్నంతనే దిమ్మ తిరిగిపోయేలా మారింది.

తాము నారాయణ కాలేజీలో చదువుతుంటామని.. తమ సార్ చెప్పటంతో ర్యాలీలో పాల్గొన్నామని వారు చెప్పారు. ఇంతకూ ర్యాలీ సందర్భంగా మీరేం చెబుతున్నారంటే.. జై అమరావతి అని తేల్చేశారు. నిజానికి వారు పాల్గొంటున్న ర్యాలీ మూడు రాజధానులకు అనుకూలంగా.

కానీ.. ర్యాలీలో పాల్గొన్ కుర్రాళ్లు తమకు అమరావతినే రాజధానిగా కావాలని.. జై అమరావతి అంటూ నినాదాలు చేసిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వ్యూహాత్మకం గా ఏర్పాటు చేసిన మూడు రాజధానుల ర్యాలీ ఐడియా బెడిసి కొట్టటమే కాదు.. అభాసుపాలు అయ్యేలా చేసింది. ఇలాంటి దరిద్రపు గొట్టు రాజకీయాల తో ఉన్న పరువు పోగొట్టుకోవటం కాక మరేం ఉంటుంది?
Tags:    

Similar News