బాబును రామ్ మాధ‌వ్ క‌డిగిపారేశారే!

Update: 2018-03-19 11:31 GMT
ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం కొన‌సాగుతున్న పోరు జాతీయ రాజ‌కీయాల‌ను ఒక్క‌సారిగా మార్చేసింద‌నే చెప్పాలి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ కంటే కూడా ఇప్పుడు జాతీయ రాజ‌కీయాలు చాలా వాడీవేడీగా జ‌రుగుతున్నాయి. నిమిష నిమిషానికీ మారిపోతున్న ప‌రిణామాల‌తో జాతీయ రాజ‌కీయాల్లో ఎప్పుడేం జ‌రుగుతుంద‌న్న విషయం అస‌లు అంచ‌నాల‌కే చిక్క‌డం లేదు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాల్సిందేన‌ని ఆది నుంచి డిమాండ్ చేస్తున్న విప‌క్ష వైసీపీ ఇటీవ‌లి కేంద్ర బ‌డ్జెట్ త‌ర్వాత పోరాటాన్ని ఉధృతం చేసిన నేప‌థ్యంలో అనివార్యంగానే టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్ర‌త్యేక ప్యాకేజీ మాట‌ను వ‌దిలేసి ప్ర‌త్యేక హోదా జ‌పాన్ని భుజానికెత్తుకున్నారు. ఈ క్ర‌మంలో వైసీపీ తీసుకున్న డేరింగ్ డెసిష‌న్స్ కార‌ణంగా తొలుత త‌న పార్టీకి చెందిన కేంద్ర మంత్రుల‌తో రాజీనామాలు చేయించిన చంద్ర‌బాబు... ఆ త‌ర్వాత వైసీపీ అవిశ్వాస తీర్మానం నేప‌థ్యంలో ఏకంగా ఎన్డీఏ నుంచి బ‌య‌ట‌కు రాక త‌ప్ప‌లేదు. మొత్తంగా వైసీపీ హోదా పోరాటాన్ని ప‌తాక స్థాయికి తీసుకెళితే... చంద్ర‌బాబు త‌న మిత్రప‌క్షం బీజేపీకి యాంటీగా మారిపోక త‌ప్ప‌లేదు.

ఈ క్ర‌మంలో మొన్న‌టిదాకా బీజేపీని ప‌ల్లెత్తు మాట కూడా అనేందుకు సాహ‌సించ‌ని చంద్ర‌బాబు... టీడీపీని ఇరుకున పెట్టేందుకే బీజేపీ వైసీపీ - జ‌న‌సేన‌ల‌తో లోపాయికారీ ఒప్పందాల‌ను కుదుర్చుకుంద‌ని ఆరోపించారు. అంతేకాకుండా ఏపీకి ప్ర‌త్యేక హోదా ఎగ్గొంటేందుకే బీజేపీ డ్రామాలు ఆడుతోంద‌ని కూడా చంద్ర‌బాబు కాస్తంత ఘాటు కామెంట్ల‌నే చేశార‌ని చెప్పాలి. అయితే మొన్న‌టిదాకా చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌ను అంత పెద్ద‌గా ప‌ట్టించుకోని బీజేపీ... చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌కు ఏపీకి చెందిన బీజేపీ నేత‌ల‌తోనే కౌంట‌ర్లు ఇప్పించేంది. చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు శృతి మించిపోతున్న నేప‌థ్యంలో బీజేపీ కూడా అంతే స్థాయిలో కౌంట‌ర్లు ఇచ్చేందుకు రెడీ అయిపోయింద‌ని ఇటీవ‌లి ప‌రిణామాల‌ను చూస్తే అర్థ‌మవుతోంది. ఈ క్ర‌మంలోనే నేటి ఉద‌యం మీడియా ముందుకు వ‌చ్చిన బీజేపీ సీనియ‌ర్ నేత‌ - కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌... చంద్ర‌బాబు నిజ నైజాన్ని బ‌య‌ట‌పెట్టేలా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు టీడీపీ... ఎన్డీఏ నుంచి ఎందుకు వైదొల‌గింద‌న్న కార‌ణాన్ని ప్రస్తావించిన ప్ర‌సాద్‌... వైసీపీని చూసి భ‌యపడిన కార‌ణంగానే చంద్ర‌బాబు ఆ నిర్ణ‌యం తీసుకున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు.

తాజాగా బీజేపీలోని మ‌రో సీనియ‌ర్ నేత‌ - తెలుగు నేలతో అనుబంధం ఉన్న రామ్ మాధ‌వ్ రంగంలోకి దిగిపోయారు. బీజేపీ డ్రామాలు ఆడుతోంద‌న్న చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల కార‌ణంగానే మాధ‌వ్ ఎంట్రీ ఇచ్చేశార‌ని తెలుస్తోంది. రాజకీయ క్రీడలో చంద్రబాబును మించిన వారు లేరని మాధ‌వ్ సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. పొలిటికల్ గేమ్‌లు ఆడటంలో చంద్రబాబును మించిన వారు ఒక్కరు కూడా లేరని ఆయ‌న వ్యాఖ్యానించారు. రాజకీయ జిమ్మిక్కులకు చంద్ర‌బాబు పేరుగాంచారని ఎద్దేవా చేశారు. ఏపీ అభివృద్ధి కోసం తాము మొదటి నుంచి బాబు వెంట ఉన్నామన్నారు. ఏపీలో తాము ఇతర పార్టీలతో కలిసి టీడీపీకి చెక్ పెట్టేందుకు డ్రామాలు ఆడుతున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని రామ్ మాధవ్ ఖండించారు. రాజకీయ డ్రామాలు అనే విషయానికి వస్తే ఎక్కువగా అలాంటివి చేసింది ఆ పార్టీయే అని చంద్రబాబుకు దిమ్మతిరిగే షాకిచ్చారు. టీడీపీ లేదా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై తమకు ఎలాంటి భయం లేదని రామ్ మాధవ్ చెప్పారు. తమకు సరైన బలం ఉందని చెప్పారు. టీడీపీ అవిశ్వాస తీర్మానం రాజకీయం అన్నారు. నిన్న‌టిదాకా త‌మ‌తోనే క‌లిసి సాగిన టీడీపీ హఠాత్తుగా సెంటిమెంట్ ఇష్యూని తెరపైకి ఎందుకు తీసుకు వచ్చిందని ప్ర‌శ్నించారు. అంతేకాకుండా అవిశ్వాస తీర్మానం ఎందుకు పెడుతుందని, వీటిపై ఏపీ ప్రజలకు ఆ పార్టీ సమాధానం చెప్పాలని రామ్ మాధవ్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News