తెలుగు రాష్ట్రాల‌పై బీజేపీ టార్గెట్ ఏంటో తెలుసా?

Update: 2016-05-22 11:15 GMT
ఆంధ్రప్ర‌దేశ్‌ - తెలంగాణ...బీజేపీకి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన రాష్ట్రాలివి. రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో రావ‌డం  ఇప్ప‌ట్లో సాధ్యం కాక‌పోయిన కొత్త టార్గెట్‌ ను బీజేపీ నేత‌లు నిర్దేశించుకున్నార‌ట‌. పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ్‌ మాధ‌వ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని విస్తరించేందుకు పటిష్ట వ్యూహంతో ముందుకెళ్తామని ప్రకటించారు.

2019నాటికి తెలుగు రాష్ట్రాల్లో బలీయమైన శక్తిగా పార్టీని విస్తరిస్తామన్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తామన్నారు. ఆంధ్రప్ర‌దేశ్‌ లో మరింత ఎదుగుతామని, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష స్థాయికి చేరడమే లక్ష్యమని ప్రకటించారు. ఏపీ బీజేపీకి త్వరలోనే కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారని  రామ్ మాధ‌వ్ అన్నారు. ఆంధ్రలో తాము తెలుగుదేశం పార్టీతో కలిసి అధికారంలో ఉన్నామ‌ని అయితే అధికార పార్టీగా ప్రజామన్నన పొందుతూనే బీజేపీని పటిష్టం చేసుకుంటూ విస్తరణకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ శూన్యత ఉందని పేర్కొంటూ ఆ శూన్యాన్ని బీజేపీతో పూడ్చేందుకు కృషి చేస్తామని రామ్‌ మాధ‌వ్ అన్నారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తామ‌ని తెలిపారు.  తెలంగాణలో ఇప్పుడు మూడో స్థానంలో ఉన్నామ‌ని రెండో స్థానానికి రావటానికి కృషి చేస్తామని చెప్పారు.తెలంగాణలో రెండోస్థాయికి ఎదగటాన్ని సవాల్‌ గా తీసుకున్నామని ఆయ‌నన్నారు.

విభజన చట్టం హామీలు నెరవేర్చ‌లేద‌ని, ప్ర‌త్యేక‌ హోదా ఇవ్వకపోవటంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో ఆంధ్రలో బీజేపీ ఎలా ఎదుగుతుందన్న మీడియా ప్రశ్నకు సమధానమిస్తూ ఆంధ్ర అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందని రామ్ మాధ‌వ్‌ చెప్పారు. బీజేపీపై ప్రజల్లో నెలకొన్న తప్పుడు అభిప్రాయాలు, అపోహలను దూరం చేసేందుకు ప్రయత్నిస్తామని ఆయ‌న‌ ప్రకటించారు. ప్రత్యేక హోదాను ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారన్నది వాస్తవమ‌ని దీనికి సంబంధించి కేంద్రంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర‌బాబు చర్చిస్తున్నారని తెలిపారు. ఆంధ్రకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని రామ్‌ మాధవ్ అన్నారు. గత రెండేళ్లలో కేంద్రం ఆంధ్రకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన విషయాన్ని మర్చిపోకూడదన్నారు. రానున్న రెండు మూడేళ్లలో అనేక విధాల సహాయ సహకారాలు అందుతాయని హామీ ఇచ్చారు.
Tags:    

Similar News