హైకోర్టు విభ‌జ‌న పూర్తి...ఇదే అపాయింట్ డే

Update: 2018-12-20 07:40 GMT
సుదీర్ఘ‌కాలంగా పెండింగ్‌ లో ఉన్న అంశానికి ఫుల్ స్టాప్ ప‌డింది. ఉమ్మడి హైకోర్టు విభజన ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. ఉగాది పండుగ మరుసటిరోజు ఏప్రిల్ ఏడో తేదీని ఏపీ హైకోర్టుకు అపాయింటెడ్ డేగా నోటిఫై చేస్తూ రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ప్రస్తుత ఉమ్మడి హైకోర్టు స్థానంలో ఏపీ - తెలంగాణలకు సొంత ఉన్నత న్యాయస్థానాలు ఏర్పాటుకానున్నాయి. ఏపీ నూతన రాజధాని అమరావతిలో హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తయిన వెంటనే హైకోర్టు విభజనను పూర్తిచేస్తామని కేంద్రం గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అమరావతిలోని నేలపాడు గ్రామంలో హైకోర్టు భవనాల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. ఇది తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఏప్రిల్ ఏడో తేదీని అప్పాయింటెడ్ డేగా నోటిఫైచేశారు. రాష్ట్ర విభజన తదుపరి ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ర్టాలకు ఉమ్మడి ఉన్నత న్యాయస్థానంగా ఉన్న హైకోర్టు.. ఏప్రిల్ ఏడున ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీ - తెలంగాణ హైకోర్టులుగా విడిపోనుంది. నేలపాడులో సాగుతున్న నిర్మాణాలను ఇటీవలే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు ఇతర న్యాయమూర్తులు సందర్శించి.. సంతృప్తిని వ్యక్తంచేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చారు. డిసెంబర్ చివరినాటికి ఏపీ హైకోర్టు నిర్మాణం పూర్తికాగానే సంక్రాంతి సెలవుల అనంతరం తరలింపు ప్రక్రియ మొదలవుతుంది. అధికారికంగా 2019 ఏప్రిల్ ఏడో తేదీ నుంచి ఏపీ, తెలంగాణ హైకోర్టులు విడివిడిగా ఆయా రాష్ర్టాల్లో పనిచేస్తాయి.

ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు విషయంలో కేంద్రం పచ్చజెండా ఊపిన నేపథ్యంలో ఉమ్మడి హైకోర్టులోని న్యాయమూర్తులను ఇరు రాష్ర్టాల హైకోర్టులకు కేటాయింపుపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. అయితే కొంతకాలం క్రితమే వ్యక్తిగతంగా ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం కేంద్ర న్యాయశాఖ ఇరు రాష్ర్టాలకు జడ్జీలను కేటాయించింది. ఇందులో 11 మంది తెలంగాణకు - 15 మంది ఆంధ్రప్రదేశ్‌ కు వెళ్లాల్సి ఉంది. తెలంగాణకు కేటాయించిన 11 మందిలో జస్టిస్ నాగార్జునరెడ్డి ఈ నెల మొదటివారంలో పదవీ విరమణ చేశారు. దీనితో తెలంగాణకు కేటాయించిన జడ్జీల్లో 10 మంది మాత్రమే ఉన్నారు. తాజాగా జస్టిస్ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్ - జస్టిస్ వీ రామసుబ్రహ్మణ్యం ఉమ్మడి హైకోర్టు జడ్జీలుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఇద్దరిలో ఒకరిని ఏపీకి - మరొకరిని తెలంగాణకు కేటాయించే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎస్ రాధాక్రిష్ణన్ సుప్రీంకోర్టుకు వెళ్ళేందుకు అవకాశం ఉందని సమాచారం. కొద్ది రోజుల క్రితమే పూర్తి చేసిన హైకోర్టు జడ్జీల కేటాయింపు ఇలా ఉంది.

తెలంగాణకు:
1. జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి (డిసెంబర్ మొదటివారంలో పదవీ విరమణ చేశారు) - 2. జస్టిస్ పీవీ సంజయ్‌ కుమార్ - 3. జస్టిస్ ఎమ్మెస్ రాంచందర్‌ రావు - 4. జస్టిస్ ఏ రాజశేఖర్‌ రెడ్డి - 5. జస్టిస్ పీ నవీన్‌ రావు - 6. జస్టిస్ చల్లా కోదండరాం - 7. జస్టిస్ బీ శివశంకర్‌ రావు - 8. జస్టిస్ షమీం అక్తర్ - 9. జస్టిస్ పీ కేశవరావు - 10. జస్టిస్ అభినంద్‌ కుమార్ షావిలి - 11. జస్టిస్ టీ అమర్‌ నాథ్‌ గౌడ్,

ఆంధ్రప్రదేశ్‌ కు:
1. జస్టిస్ సీ ప్రవీణ్‌ కుమార్ - 2. జస్టిస్ ఎస్వీ భట్ - 3. జస్టిస్ ఎస్వీ శేషసాయి - 4. జస్టిస్ ఎం సీతారామమూర్తి - 5. జస్టిస్ యూ దుర్గాప్రసాద్ - 6. జస్టిస్ సునీల్ చౌదరి - 7. జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి - 8. జస్టిస్ జీ శ్యాంప్రసాద్ - 9. జస్టిస్ జే ఉమాదేవి - 10. జస్టిస్ ఎన్ బాలయోగి - 11. జస్టిస్ టీ రజని - 12. జస్టిస్ డీవీఎస్ ఎస్ సోమయాజులు - 13. జస్టిస్ కే విజయలక్ష్మి - 14. జస్టిస్ ఎం గంగారావు.

Tags:    

Similar News