మోడీ రాముడి ఎజెండా స్పీడ‌ప్

Update: 2017-05-15 07:27 GMT
ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆలోగా రాముడి గుడి ఎజెండాను స్పీడ్ అప్ చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.  లోక్‌సభ ఎన్నికల నాటికి ఉత్తరప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా రామ మందిర అంశాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు కార్యాచ‌ర‌ణ త్వ‌ర‌లో మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. నిజానికి ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లి ఎన్నికలకు ముందునుంచే మోడీ ఈ ప్లానును మెల్ల‌మెల్ల‌గా ఆచ‌ర‌ణ‌లో పెడుతున్న‌ట్లు చెబుతున్నారు.

మ‌రోవైపు అయోధ్యలో వివాదాస్పద స్ధలానికి దూరంగా రాముడి గుడి నిర్మాణానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయ‌ని చెబుతున్నారు. అయితే దీన్ని మ్యూజియం పేరుతో నిర్మిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు పేరులో గుడితో పాటు మ్యూజియం అన్న ప‌దాన్ని కూడా చేర్చారు.అయోధ్యలో రామ్‌-రామాయణ మ్యూజియం పేరుతో నిర్మాణ ఏర్పాట్లు జ‌రుగుతుండ‌డంతో మోడీ అజెండాపై కొత్త ప్ర‌చారం మొద‌లైంది. రామ మందిరం అజెండా ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఉండ‌క‌పోవ‌చ్చంటున్నారు.

ఈ మ్యూజియాన్ని ఒక పర్యాటక కేంద్రంగా రూపొందించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటిసారిగా గ‌త‌ అక్టోబరులో దీనికి సంబంధించి తొలిసారి బ‌య‌ట‌ప‌డ్డారు. మ్యూజియం కోసం అయోధ్యలో స్ధలాన్ని కూడా గుర్తించారు. అయితే అప్పుడు ఉన్న అఖిలేష్‌ యాదవ్‌ ప్రభుత్వం ఆ స్ధలాన్ని కేటాయించేందుకు ఇష్టపడలేదు. దాంతో అప్పట్లో అది అక్కడితో ఆగిపోయింది. గత మార్చిలో రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. యోగి అధికార పీఠాన్ని అధిష్టించిందే తడవుగా సరయూ నది ఒడ్డున పాతిక ఎకరాల స్ధలం కేటాయించేశారు. ఇప్పుడిక కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ప్రాజెక్టుగా 225 కోట్ల రూపాయల ఖర్చుతో మ్యూజియం నిర్మించబోతున్నారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా వివాదాస్పద రామమందిర స్ధలానికి ఆరు కిలోమీటర్ల దూరంలో పెద్ద దేవాలయం కడతారు. దానికి అనుసంధానంగా రామ్‌ దర్బార్‌ ఉంటుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని నిర్మించబోతున్నారు. వర్చ్యువల్‌ రియాలిటీ, త్రీడీ టెక్నాలజీలతో పురాతన సంప్రదాయాలకు రూపకల్పన చేయడం ఇందులోని విశేషం. భక్తి గీతాలాపనలుంటాయి. రాముడి బోధనలను వినిపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే నిత్యం యజ్ఞాలు చేస్తారు. ఇందులో స్ధూలంగా భక్తిస్ఫోరక దేవాలయం ఉంటుంది. పర్యాటకులకు రాముడి లీలలు, బోధనలు, జీవితచరిత్ర తెలియజెప్పే ఉద్దేశంతో దృశ్యశ్రవణపూర్వక మ్యూజియం ఉంటుంది.

ఈమొత్తం ప్రాజెక్టు నిర్వహణ, పర్యవేక్షణ కోసం కేంద్రం ఒక కమిటీ వేసింది. దానిపేరు రామాయణ సర్య్కూట్‌ నేషనల్‌ కమిటీ. దీనికి రామ్‌ అవతార్‌ చైర్మన్‌. రాముడి మీద పరిశోధనలు చేసిన అనుభవం ఉండటం వల్ల ఆయనకు దీని బాధ్యతలు అప్పగించారు. రాముడు కేవలం హిందువులకు మాత్రమే చెందినవాడు కాదని ఆయన అభిప్రాయం. అన్ని మతాల ప్రజలకు ఆయన ఆలోచనా విధానం, ఆయన జీవనసరళి ఆదర్శప్రాయమని రామ్‌ అవతార్‌ అభిప్రాయం. ఈ మ్యూజియం నిర్మాణం వెనక ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని ఆయన అంటున్నారు.  దీన్ని ఏడాదిన్నరలోపు పూర్తి చేయాలని గడువు పెట్టుకున్నారు. అంటే 2019 సార్వత్రిక ఎన్నికలలోగా దీని నిర్మాణం పూర్తయి, ఇది ప్రజలకు అందుబాటులోకి రావాలన్న ఉద్దేశం క‌నిపిస్తోంది.
Tags:    

Similar News