రెండేళ్లలో అయోధ్య టెంపుల్ కట్టేస్తారంట

Update: 2015-12-07 09:48 GMT
అప్పుడెప్పుడో 23 ఏళ్ల కిందట కూల్చివేతకు గురైన వివాదాస్పద కట్టడం (కొందరు రామాలయంగా.. మరికొందరు బాబ్రీ మసీదుగా వ్యాఖ్యానిస్తుంటారు. సుప్రీం కోర్టు మాత్రం విస్పష్టంగా దాన్ని వివాదాస్పద కట్టడంగా వ్యవహరించాలని.. మీడియాలోనూ అలానే రాయాలని ఆదేశించింది) స్థానంలో రామాలయాన్ని నిర్మిస్తామని.. అది కూడా రెండేళ్లలో పూర్తి చేస్తామంటూ విశ్వహిందూ పరిషత్ తాజాగా ప్రకటించింది.

వివాదాస్పద కట్టడం కూలిపోయిన డిసెంబర్ 6ను కొన్ని పక్షాలు బ్లాక్ డే గా.. మరికొన్ని పక్షాలు శౌర్య దివస్ గా జరుపుకోవటం తెలిసిందే. ఆదివారం నాడు శౌర్యదివస్ ను వీహెచ్ పీ లాంటి హిందుత్వ సంస్థలు నిర్వహించగా.. బ్లాక్ డేగా ముస్లిం వర్గాలు పాటించాయి. ఈ నేపథ్యంలో వీహెచ్ పీ నేతలు మాట్లాడుతూ.. రానున్న రెండేళ్ల వ్యవధిలో అయోధ్యలో రామాలయం కట్టటం ఖాయమని చెప్పారు.

రెండేళ్లలో గుడిని కట్టేసి.. వివాదాస్పద కట్టటం కూలిన పాతికేళ్ల సందర్భంగా శౌర్య దివస్ ను భారీగా జరుపుతామంటూ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఈ అంశం కోర్టులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకొని గుడిని నిర్మించాలని విశ్వహిందూ పరిషత్ లాంటి హిందుత్వ సంస్థలు వాదిస్తున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు మరింత ఉద్రిక్తతను కలిగించటం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News