రమణ దారేది.. కమలం గూటిగా? గులాబీ కారులోకా?

Update: 2021-06-14 05:38 GMT
దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలన్న నానుడికి విరుద్ధంగా వ్యవహరించిన నేత ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణగా చెప్పాలి .రాష్ట్ర విభజన అనంతరం టీటీడీపీ పగ్గాల్ని రమణ చేతికి ఇవ్వటం.. ఆయన చూస్తుండగానే తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీ ఈ రోజున ఉనికి కోసం కిందా మీదా పడే పరిస్థితి. తోపుల్లాంటి నేతలు ఎవరికి వారు పార్టీని విడిచి పెట్టి తమ దారిన తాము పోతూ.. పదవుల్ని సొంతం చేసుకుంటున్నా.. రమణ మాత్రం అందుకు భిన్నంగా టీడీపీలోనే కంటిన్యూ అయ్యారు.

ఎంత లేపినా లేచే పరిస్థితి లేకపోవటమే కాదు.. తెలంగాణలో టీడీపీ సమాధి అయినట్లేనన్న విషయాన్ని అర్థం చేసుకున్న రమణ.. ఇప్పుడు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఎంత కష్టపడినా తెలంగాణలో టీడీపీ బలోపేతం కావటం లేదన్నరమణ వ్యాఖ్యలు చూస్తే.. ఆయన పార్టీ మారేందుకు రెఢీగా ఉన్నట్లు చెప్పక తప్పదు. ఈ రోజు (సోమవారం) ఆయన జగిత్యాల నుంచి హైదరాబాద్ కు రానున్నారు.

తన భవిష్యత్ కార్యాచరణ మీద కీలక ప్రకటన చేసే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. పార్టీ మారటానికి ఇదే సరైన సమయమని సన్నిహితులు చెప్పటంతో ఆయన పార్టీ మారే విషయంపై గడిచిన కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. తొలుత టీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు రమణ రెఢీ అయినట్లుగా ప్రచారం జరిగింది. ఆయన పార్టీలోకి వస్తే ఎమ్మెల్సీని చేసి.. మంత్రిని చేస్తానన్న ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు.

కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ లోని చాలామంది నేతలకు రమణ సన్నిహితుడన్న విషయం తెలిసిందే.వారంతా కూడా ఒకప్పటి తెలుగుదేశం పార్టీలోని వారేకావటంతో ఆయన టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారని భావిస్తున్నారు. అయితే.. కేసీఆర్ మూడ్ మొదట్లో బాగానే ఉన్నా.. పార్టీలోకి చేరిన తర్వాత ఆయన తీరు మరోలా ఉంటుందన్న ఆలోచనలో రమణ ఉన్నట్లు చెబుతున్నారు. మిగిలిన వారి కంటే బాగా కేసీఆర్ గురించి తనకు తెలుసని.. ఆయన తీరు ఎప్పుడూ ఒకేలా ఉండదని.. ఇప్పుడు మంత్రి పదవి కోసం వెళితే.. తర్వాత పట్టించుకోకపోతే పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్నను తన సన్నిహితుల వద్ద చర్చించినట్లుగా తెలుస్తోంది.

మరోవైపు ఎల్. రమణను తమ పార్టీలోకి బీజేపీ నేతలు ఆహ్వానిస్తున్నారు. ఆయనకు సరైన ప్రాధాన్యత కల్పిస్తామని మాట ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. రమణ కుమారుడికి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటమే కాదు..గెలుపు బాధ్యత కూడా తీసుకుంటామన్న మాట ఇచ్చినట్లుగా సమాచారం. దీంతో.. రమణ ఎటువైపు మొగ్గుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News