న్యాయం చేస్తా..ర‌మ‌ణ‌దీక్షితుల‌కు జ‌గ‌న్ హామీ!

Update: 2018-06-07 16:51 GMT
ఏపీలో అధికార‌ప‌క్ష‌మైన తెలుగుదేశం పార్టీ నేత‌ల‌కు కొత్త ఉత్సాహం వచ్చింది. త‌మ‌కు న‌చ్చ‌ని వారు ఎవ‌రైనా...వారికి ఏదో ఒక‌ర‌క‌మైన ముద్ర వేసి విమ‌ర్శ‌లు చేయ‌డంలో ఆరితేరిన ఆ పార్టీ నేత‌ల‌కు ఓ ప‌రిణామం అందివ‌చ్చిన‌ట్ల‌యింద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. అదే... వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు - ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్‌ జగన్‌ మోహ‌న్ రెడ్డితో టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు హైదరాబాద్‌ లో భేటీ అవ‌డం. వారసత్వంగా వచ్చిన అర్చకత్వ విధుల నుంచి తమను తొలగించారంటూ రమణ దీక్షితులు ఆందోళన వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప‌లువురిని క‌లిసి త‌న ఆవేద‌న‌ను పంచుకుంటున్నారు. నిక్షేపాల కోసం తిరుమల శ్రీవారి పోటులో కొందరు తవ్వకాలు జరిపారని రమణ దీక్షితులు తీవ్ర ఆరోపణలు చేశారు. తవ్వకాలు జరిగాయనడంలో ఎలాంటి సందేహం లేదని.. ఆ వంట గదిలో జరిగిన మార్పులే ఇందుకు సాక్ష్యమని ఆయన అన్నారు. అయితే, తాజాగా ఆయ‌న జ‌గ‌న్‌ తో భేటీ అవ‌డంతో టీడీపీ నేత‌లు..ఇదే త‌మ‌కు బుర‌ద‌చ‌ల్లేందుకు వ‌చ్చిన అవ‌కాశంగా పేర్కొంటూ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అంటున్నారు.

గురువారం సాయంత్రం ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ ను రమణ దీక్షితులు హైదరాబాద్‌ లో కలిశారు. టీటీడీలో తనతో పాటు మరో ముగ్గురిని అక్రమంగా తొలగించారని రమణ దీక్షితులు వైఎస్‌ జగన్‌ కు వివ‌రించారు. టీడీపీలో జరిగిన అక్రమాలను ప్రశ్నిస్తే తమను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. వారసత్వంగా వచ్చి న అర్చకత్వం నుంచి తొలగించారని ఆయన చెప్పారు. వైఎస్‌ జగన్‌ తో భేటీ అనంతరం రమణ దీక్షితులు మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు అపాయింట్‌ మెంట్‌ కోసం చాలాసార్లు ప్రయత్నించినా ఆయన నిరాకరించారని చెప్పారు. ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌ ను కలిసి తన ఆవేదన చెప్పుకున్నాన‌ని పేర్కొన్నారు.నాకు కష్టం వచ్చినప్పుడు ఎవరు అన్నం పెడుతున్నారా అని చూడనని - ఎవరు పెడితే వారికి నమస్కారం పెడతానని అన్నారు. అలాగే, తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరు సరిదిద్దితే వారికి మద్దతు ఉంటుందన్నారు. నా పొట్ట ఎవరు నింపితే (న్యాయం చేయడం) వారికి మద్దతు అన్నారు. రూలింగ్ పార్టీని న్యాయం చేస్తే వారికి కూడా నమస్కారం పెడతా అన్నారు.  మిరాశీ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత తన పైన ఉందని చెప్పారు. నా మీద విచారణ జరిపితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. నా కష్టాలు ఎవరు వింటే వారికి చెబుతానన్నారు. మా కష్టాలు చెప్పుకోవడానికి కూడా కొందరు అవకాశం ఇవ్వలేదన్నారు. చాలా సార్లు విజయవాడకు వెళ్లి వచ్చామని - సమస్యలు వినేందుకు తమకు ఏ పార్టీ అయితే ఏమిటన్నారు. కాగా,  దీక్షితులు చెప్పిన విషయాలపై వైఎస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు.రమణ దీక్షితులుకు న్యాయం చేస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.
 
ఇదిలాఉండ‌గా...జ‌గ‌న్‌ తో ర‌మ‌ణ‌దీక్షితులు భేటీ అయిన వార్త మీడియాలో రావ‌డం ఆల‌స్యం అన్న‌ట్లుగా...టీడీపీ నేత‌లు త‌మ నోటికి ప‌దునుపెట్టారు. ఒక‌రివెంట ఒక‌రు అన్న‌ట్లుగా మీడియాతో మాట్లాడుతూ..ఇటు జ‌గ‌న్‌ ను - అటు ర‌మ‌ణ దీక్షితులును దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌తిప‌క్ష నేత‌ - శ్రీ‌వారి మాజీ ప్ర‌ధానర్చ‌కుడి భేటీయే ఓ పెద్ద త‌ప్పిదం అన్న‌ట్లుగా...విరుచుకుప‌డ్డారు. ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ బీజేపీ మ‌హాకుట్ర‌లో భాగంగానే..వైఎస్ జ‌గ‌న్‌ ను ర‌మ‌ణ‌దీక్షితులు క‌లిశార‌ని ఆరోపించారు. గ‌తంలో అమిత్‌ షాను క‌ల‌వ‌డం - ఇప్పుడు జ‌గ‌న్‌ ను క‌ల‌వ‌డం ఉద్దేశ‌పూర్వ‌క‌మే అంటూ  చిత్ర‌మైన కామెంట్ చేశారు. చంద్ర‌బాబును క‌ల‌వాల‌ని విన‌తి చేస్తే అనుమ‌తి ఇవ్వ‌న‌పుడు ప్ర‌తిప‌క్ష నేత‌కు విన్న‌వించుకోక ఇంకేం చేయాలో టీడీపీ నేత‌లే చెప్పాలి మ‌రి.
Tags:    

Similar News