రాక్షస పాలన అంతమైందట..రామరాజ్యం ప్రారంభమైందట

Update: 2019-05-26 04:06 GMT
ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఘన విజయం సాధించింది. ఏ ఒక్కరి ఊహలకు అందని రీతిలో 175 సీట్లున్న అసెంబ్లీలో వైసీపీ 151 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. అదే సమయంలో రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లుంటే.... ఏకంగా 22 సీట్లను గెలుచుకుని రికార్డు విక్టరీని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఊహించని ఓటమితో కుమిలిపోతున్న టీడీపీ శ్రేణులు బయటకు వచ్చేందుకే వెనుకాడుతున్నాయి.

ఈ నేపథ్యంలో టీడీపీ పాలనలో తీవ్ర అవమానాలకు గురైన వారు ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇలాంటి వారిలో తిరుమల వెంకన్న సన్నిధిలో ప్రధాన అర్చకుడిగా ఉంటూ టీడీపీ హయాంలో ఆ పదవి నుంచి తొలగింపునకు గురైన రమణ దీక్షితులు రంగంలోకి దిగేశారు. జగన్ గెలుపును - చంద్రబాబు పాలనను పోల్చుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ గెలుపుతో రాక్షస పాలన అంతమైందని - అదే సమయంలో జగన్ ఆధ్వర్యంలో రామరాజ్యం ప్రారంభమైపోయిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా చంద్రబాబు మాదిరిగా ఒక టెర్మో - రెండు టెర్ములో కాకుంగా జగన్ చాలా కాలం పాటు ఏపీకి సీఎంగా వ్యవహరించనున్నట్లుగానూ దీక్షితులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ హయాంలో రాష్ట్రం కరువు కాటకాలతో అల్లాడిపోయిందన్న దీక్షితులు... జగన్ ప్రభుత్వ పాలనలో అలాంటి పరిస్థితులే కనిపించవని కూడా ఆయన జోస్యం చెప్పారు. వైెస్ జగన్ బ్రాహ్మణులకు అండగా నిలిచారని - టీటీడీలో టీడీపీ రద్దు చేసిన వంశపారంపర్య అర్చకత్వాన్ని పునరుద్ధరిస్తారని కూడా దీక్షితులు ధీమా వ్యక్తం చేశారు. వంశపారంపర్య హక్కులు కలిగిన తనను ఏడాది పాటుగా స్వామివారి కైంకర్యాలకు టీడీపీ సర్కారు దూరంగా పెట్టిందని, ఈ పరిణామాలతో తాను చాలా ఇబ్బందికి గురయ్యానని - అయితే జగన్ సీఎంగా ప్రమాణం చేయగానే... తిరిగి తనకు పదవి దక్కుతుందని దీక్షితులు ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తంగా చంద్రబాబు పాలనను రాక్షస పాలనతో పోల్చిన దీక్షితులు... జగన్ పాలనను రామరాజ్యంతో పోల్చడం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది.


Tags:    

Similar News