ఆ త‌వ్వ‌కాల‌కు చంద్ర‌బాబే క‌ర్త‌..క‌ర్మ..క్రియ‌!

Update: 2018-05-23 06:51 GMT
టీటీడీ పాల‌క‌మండలికి, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కుడు ర‌మ‌ణ దీక్షితులుకు మ‌ధ్య ఏర్ప‌డ్డ వివాదం ఇప్ప‌ట‌ల్లో స‌ద్దుమ‌ణిగేలా లేదు. టీటీడీ బోర్డులో జ‌రుగుతోన్న అవ‌క‌త‌వ‌క‌ల‌పై - ఆగ‌మ శాస్త్రాల‌కు విరుద్ధంగా జ‌రుగుతోన్న ప‌నుల‌పై తాను నోరు మెదిపినందుకే ప్ర‌భుత్వం త‌న‌పై క‌క్ష్య తీర్చుకుంటోంద‌ని ర‌మ‌ణ దీక్షితులు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా, ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడుపై ర‌మ‌ణ దీక్షితులు షాకింగ్ కామెంట్స్ చేశారు. శ్రీవారి వంటశాలలోని నేలమాళిగలలో ఉన్న‌విలువైన ఆభ‌రాణాల‌కోసం జ‌రిగిన త‌వ్వ‌కాల వెనుక చంద్ర‌బాబు హ‌స్త‌ముంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆ తవ్వ‌కాల‌కు అనుగుణంగా త‌న వారిని టీటీడీలో చంద్ర‌బాబు నియ‌మించుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా, అమిత్ షాకు శ్రీ‌వారి వంట‌శాల 22 రోజుల పాటు మూసి ఉన్న సంగతి చెప్పినందుకే త‌న‌పై చంద్ర‌బాబు క‌క్ష్య సాధింపు చ‌ర్య‌లు చేప‌ట్టి త‌న‌కు ఉద్వాస‌న ప‌లికార‌ని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఓ జాతీయ చానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ర‌మ‌ణ దీక్షితులు చంద్ర‌బాబుపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

శ్రీ‌వారి వంటశాల‌లో రహస్యంగా దాచి పెట్టిన విలువైన వ‌జ్రాలు, ఆభ‌ర‌ణాలు దక్కించుకోవడానికి ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా చంద్ర‌బాబు త‌న వారితో తవ్వకాలు జరిపించార‌ని రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్య‌లు చేశారు. బ‌య‌టి వ్య‌క్తుల‌కు అది సాధ్యం కాద‌ని, టీటీడీలో అత్య‌ధికంగా త‌న‌ సామాజిక వ‌ర్గం వారిని నియ‌మించుకుని చంద్ర‌బాబు ఈ పని చేశారని ఆరోపించారు. ఈ కార్య‌క్రమానికి సీఎం చంద్రబాబుదే బాధ్యతని అన్నారు. పాక‌శాల‌ గదిలో కొత్త ఫ్లోరింగ్, గోడలు, ఇటుకలు మారాయని....త‌వ్వ‌కాలు జ‌రిగిన‌ట్లు అవే ఆధారాల‌ని అన్నారు. తిరుమ‌ల‌తో పాటు రాష్ట్రంలోని పురాతన కోటల్లోనూ ఈ త‌ర‌హా త‌వ్వ‌కాలు ప్ర‌భుత్వం చేప‌ట్టింద‌ని అన్నారు. డాలర్ శేషాద్రి వద్ద రూ. 50 కోట్ల విలువైన శ్రీవారి నగలను దాచి పెట్టారని ఆరోపించారు. అయితే, టీటీడీ సొమ్మును తిరుపతి, ఒంటిమిట్ట, రహదారుల నిర్మాణం కోసం వాడుతున్నారని, అలా చేయ‌డం కూడా నిబంధనలకు విరుద్ధమని అన్నారు.

కొద్ది రోజుల క్రితం శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన అమిత్ షాను తానే ఆహ్వానించి, స్వామి దర్శనం చేయించానని అన్నారు. ఆ త‌ర్వాత శ్రీ‌వారి వంటగది లోప‌లికి తీసుకెళ్లాన‌ని,శ్రీ‌వారి వంట‌శాల‌లో జ‌రిగిన మార్పుల‌ను వివ‌రించాన‌ని ర‌మ‌ణ దీక్షితులు అన్నారు. స్వామి నైవేద్యాలను  మొదటి ప్రాకారానికి ఆవల ఎన్న‌డూ చేయలేదని, తప్పు జరిగిందని చెప్పాన‌ని అన్నారు. నిధుల కోసం ప్రభుత్వం తవ్వకాలు జరిపింద‌ని, అమిత్ షాకు వెల్ల‌డించినందునే త‌న‌పై చంద్ర‌బాబు క‌క్ష్య సాధింపు చ‌ర్య‌లు చేప‌ట్టార‌ని అన్నారు. వంటగదిలో ఏం జరిగిందన్న ప్ర‌శ్న‌కు ఈఓ కూడా తనకేమీ తెలియదని బదులిచ్చారని అన్నారు. తాజాగా చంద్ర‌బాబుపై ర‌మ‌ణ దీక్షితులు చేసిన వ్యాఖ్య‌లపై చంద్ర‌బాబు ఏవిధంగా స్పందిస్తారో ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News