సీఎం సొంత జిల్లాలో టీడీపీ వైపు చూస్తోన్న వైసీపీ నేత !

Update: 2021-08-23 05:46 GMT
కడప జిల్లా రాజకీయాలు ఏ క్షణంలో ఓ మలుపు తిరుగుతాయో ఎవరూ కూడా అంచనా వేయలేకపోతున్నారు. పార్టీలు మారడం అనేది రాజకీయంలో సర్వసాధారణం. స్థానిక పరిస్థితులని బట్టి నేతలు పార్టీల్లోకి జంప్ అవుతుంటారు. కానీ, అలా జంప్ అయిన వారికి , ఆ పార్టీలో సముచిత స్థానం లభించవచ్చు, లేదా లభించకపోవచ్చు. ఎందుకు అంటే ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నా కూడా నిన్న మొన్నటి వరకు ఆయనే ప్రత్యర్థి కావడంతో జంప్ అయిన వారిని ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ అదే పార్టీలోకి తిరిగి వెళ్లే ఆలోచన కూడా చేస్తారు. ప్రస్తుతం అదే సందిగ్ధం లో మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నేత పొన్న‌పురెడ్డి రామ‌సుబ్బారెడ్డి ఉన్నారని ప్రచారం జరుగుతుంది.

వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డితో స‌మ‌స్య లేక‌పోయినా, నియోజ‌కవ‌ర్గ స్థాయిలో అధికార పార్టీ నేత‌లు అవ‌మానించే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో త‌మ నాయ‌కుడు మ‌న‌స్తాపం చెందిన‌ట్టు రామసుబ్బారెడ్డి అనుచ‌రులు చర్చించుకుంటున్నారు. దీనితో  టీడీపీ నుంచి వైసీపీలో చేరి త‌ప్పు చేశామ‌నే అంత‌ర్మ‌థ‌నం చెందుతు న్న‌ట్టు తెలుస్తోంది. ఒక‌వైపు అధిష్టానం పెద్ద‌లు కొన్ని నెల‌ల క్రితం జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే డాక్ట‌ర్ సుధీర్‌ రెడ్డి, పి.రామ‌సుబ్బారెడ్డిని కూర్చోపెట్టి చ‌ర్చించి, క్లారిటీ ఇచ్చారు. 2024లో తిరిగి జ‌మ్మ‌ల‌మ‌డుగు అభ్య‌ర్థిగా సుధీర్‌ రెడ్డే ఉంటార‌ని అధిష్టానం పెద్ద‌లు తేల్చి చెప్పారు. రామ‌సుబ్బారెడ్డికి త‌గిన గౌర‌వం ఇస్తామ‌ని చెప్పి పంపారు.

దీంతో తాను పార్టీ మారుతాన‌నే ప్ర‌చారంలో నిజం లేద‌ని అప్ప‌ట్లో రామ‌సుబ్బారెడ్డి స్ప‌ష్ట‌త ఇచ్చారు. కానీ ఆయ‌న పార్టీ నుంచి వెళ్లిపోయేలా పొగ‌పెడుతున్నార‌ని రామ‌సుబ్బారెడ్డి అనుచ‌రులు చెబుతున్నారు. క్షేత్ర‌స్థాయిలో రామ‌సుబ్బారెడ్డి మాట‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ద్ద‌ని అధికారుల‌కు స‌ద‌రు ప్ర‌జాప్ర‌తినిధి అన‌ధికార ఆదేశాలు ఇచ్చార‌ని స‌మాచారం. దీంతో ఇక పార్టీలో ఉండి ప్ర‌యోజ‌నం ఏంట‌నే ప్ర‌శ్న రామ‌సుబ్బారెడ్డి, ఆయ‌న అనుచ‌రుల నుంచి వ‌స్తున్న ప్ర‌శ్న‌. ఇప్పటికే పదవి లేదు , అలాగే వచ్చే ఎన్నికల్లో సీటు కూడా అని ఇప్పటికే ఖరాఖండిగా వెల్లడించారు. దీనితో ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తారేమో , కాబట్టి ఆ నామినేటెడ్ పోస్ట్ కోసం పార్టీలో అవమాన పడుతూ కొనసాగాలా అని అనుచ‌రులు చర్చించుకుంటున్నారు. అలాగే ఒకప్పుడు అక్కడే చక్రం తిప్పిన నేతగా ఆయనగా మంచి గుర్తింపు ఉంది. అలాంటి సీనియర్ ను ఇన్ని అవమానాలకి గురి చేస్తారా అని అయన అనుచ‌రులు పెదవి విరుస్తున్నారు. ఈ కారణాలతోనే రాజకీయ భవిష్యత్ కి పునాది వేసిన టీడీపీలో కి మళ్లీ వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి బీజేపీలో చేర డంతో జ‌మ్మ‌ల‌మ‌డుగులో ప్ర‌తిప‌క్ష పార్టీకి నాయ‌కుడు లేకుండా పోయారు. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను దృష్టిలో పెట్టుకుని త‌న‌ను గౌర‌వించే టీడీపీలోకి వెళ్లాల‌నే ఆలోచనలో  ఆయ‌న ఉన్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్య‌మంత్రే స్వ‌యంగా ఆదిరించినా ,స్థానిక నేత‌ల‌తో విభేదాల వ‌ల్ల పార్టీ వీడే ప‌రిస్థితి.  శివారెడ్డి హ‌త్యానంత‌రం ఆయ‌న అన్న కుమారుడు రామ‌సుబ్బారెడ్డి తెర‌పైకి వ‌చ్చారు. ఈయ‌న 1994, 99లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయ‌న కూడా ఎన్టీఆర్‌, చంద్ర‌బాబు కేబినెట్‌లో ప‌నిచేశారు. అప్ప‌టి నుంచి వ‌రుస‌గా ఓటమి పాల‌వుతూ వ‌స్తున్నారు. కానీ సౌమ్యుడిగా ఆయన‌కు పేరుంది.
Tags:    

Similar News