అమ్మ హ‌త్య‌కు గుర‌య్యారా?

Update: 2017-01-08 04:17 GMT
త‌మిళ తంబీలంతా అమ్మ‌గా పిలుచుకునే త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జె.జ‌య‌ల‌లిత మ‌ర‌ణంపై ఇంకా అనుమానాలు వీడ‌లేదు. తీవ్ర జ్వ‌రం - డీహైడ్రేష‌న్ కార‌ణంగా చెన్నై అపోలో ఆసుప‌త్రిలో చేరిన జ‌య‌... దాదాపు 73 రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. ఆసుప‌త్రిలో చేరిన స‌మ‌యంలో జ‌య ఆరోగ్యం విష‌మ ప‌రిస్థితిలో ఉన్నా... లండ‌న్ నుంచి వైద్య నిపుణుడు డాక్ట‌ర్ రిచ‌ర్డ్ బిలే - ఎయిమ్స్ వైద్యులు - సింగ‌పూర్ నుంచి వ‌చ్చిన ఫిజియోథెర‌పిస్టులు - అపోలో వైద్యులు అందించిన చికిత్స‌తో ఆమె ఆరోగ్యం మెరుగుప‌డింది. ఒక‌ట్రెండు రోజుల్లో ఆమె ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి అవుతార‌ని సాక్షాత్తు అపోలో ఆసుప‌త్రి అధికారికంగా ప్ర‌క‌టించినా... హాఠాత్తుగా గుండెపోటు రావ‌డంతో ఆమె మ‌ర‌ణించారు.

ఈ క్ర‌మంలో జ‌య మ‌ర‌ణంపై ప‌లువురు ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేశారు. జ‌య నెచ్చెలి - ప్ర‌స్తుతం అన్నాడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ‌శిక‌ళ వైపే ఈ అనుమానం వ్య‌క్తమైంది. శ‌శిక‌ళ‌నే జ‌య‌ను ఏమైనా చేసి ఉంటార‌ని కొంద‌రు బ‌హిరంగంగానూ ఆరోపించారు. తాజాగా అన్నాడీఎంకే పార్టీకే చెందిన ఓ నేత‌... తాము అమ్మ‌గా భావిస్తున్న జ‌య‌ను ఎవ‌రో హ‌త్య చేశార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. ఆరోప‌ణ‌లు చేయ‌డంతోనే ఆయ‌న ఆగిపోలేదు... ఏకంగా ఈ విష‌యంపై ద‌ర్యాప్తు జ‌రిపించాల‌ని ఆయ‌న ఏకంగా కోర్టులో పిటిష‌న్ కూడా దాఖ‌లు చేశారు. త‌మిళ‌నాడులోని దుండిగ‌ల్ జిల్లాకు చెందిన అన్నాడీఎంకే నేత‌గానే కాకుండా న్యాయ‌వాదిగానూ కొన‌సాగుతున్న రామ‌స్వామి అనే వ్య‌క్తి ఈ మేర‌కు నిన్న మ‌దురైలోని మ‌ద్రాస్ హైకోర్టు బెంచ్‌ లో ఈ పిటిష‌న్‌ ను దాఖ‌లు చేశారు.

త‌న పిటిష‌న్‌ లో శ‌శిక‌ళ‌ను టార్గెట్ చేస్తూ ఆయ‌న సంచ‌ల‌న ఆరోప‌ణ‌లే చేశారు. జ‌య ఆసుప‌త్రిలో చేరిన నాటి నుంచి ఆమె వెన్నంటి ఉన్న శ‌శిక‌ళ‌... సీఎం హోదాలో ఉన్న జ‌య‌ను ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చిన ఏ ఒక్క‌రిని కూడా లోప‌లికి ఎందుకు అనుమ‌తించ‌లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అంతేకాకుండా... జ‌య‌కు రెండు కాళ్లు తీసేసిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయ‌ని ఆయ‌న త‌న పిటిష‌న్ లో ప్ర‌స్తావించారు. ఆసుప‌త్రిలో జ‌య ఉన్నంత కాలం చోటుచేసుకున్న ప‌రిణామాల‌న్నింటినీ ప‌రిశీలిస్తే... జ‌య ముమ్మాటికీ హ‌త్య‌కు గుర‌య్యార‌నే తాను భావిస్తున్నాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. త‌న మ‌న‌సులో నాటుకున్న ఈ అనుమానాల‌ను తొల‌గించేందుకు జ‌య మ‌ర‌ణంపై సీబీఐ చేత ద‌ర్యాప్తు చేయించాల‌ని ఆయ‌న కోర్టును అభ్య‌ర్థించారు. ఇప్ప‌టికే ఈ త‌ర‌హాలో దాఖ‌లైన ప‌లు పిటిష‌న్ల‌ను కొట్టివేసిన కోర్టులు... రామ‌స్వామి పిటిష‌న్‌ పై ఎలా స్పందిస్తాయోన‌న్న అంశంపై ఆస‌క్తి నెల‌కొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News