ప్రమాణం చేసే హడావుడిలో పేరు మర్చిపోయారు

Update: 2016-07-05 10:24 GMT
మోడీ మంత్రివర్గంలో మంత్రిగా అవకాశం కల్పించటం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే.. తన టీమ్ లో తీసుకునే మంత్రుల విషయంలో ఎన్నో వడపోతల తర్వాతే పేరు కన్ఫర్మ్ అవుతుంది. ఎవరి ఒత్తిళ్లను అంత తేలిగ్గా ఒప్పుకోని మోడీ లాంటి నేత.. మంత్రిగా తన టీమ్ లోకి తీసుకోవటాన్ని చాలామంది నేతలు అదృష్టంగా.. గర్వంగా ఫీలవుతారు. మరి.. ఆ సంతోషమో ఏమో కానీ.. కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రామ్ దాస్ అథవలే తన పేరును చెప్పటం మర్చిపోయారు.

అథవలే పేరును పిలిచిన తర్వాత నేరుగా మైకు వద్దకు వచ్చిన ఆయన.. వచ్చినంతనే తన జేబులో నుంచి ఒక పేపర్ ను తీశారు. మరోవైపు రాష్ట్రపతి ‘‘మై’’ అన్న మాటను ఆయన పట్టించుకోకుండా తన చేతిలో ఉన్న ప్రసంగాన్ని చదువుకుండా వెళ్లిపోయారు. రెండు.. మూడు మాటలు అలా వెళుతున్న ఆయన వేగానికి మోడీ బ్రేకులు వేస్తూ.. ముందు పేరు చెప్పాలన్నారు.

దీంతో తాను చేసిన తప్పును గుర్తించిన అథవలే వెంటనే సారీ చెప్పి.. తన పేరు చెప్పి ప్రమాణస్వీకారాన్ని సంప్రదాయప్రకారం పూర్తి చేశారు. అదే సమయంలో తన ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా తన ప్రసంగ పాఠాన్ని చూసి చదివే సమయంలోనూ ఆయన ఒకింత ఒత్తిడికి గురైనట్లుగా కనిపించింది. చూసి చదివే విషయంలోనూ తడబాటు స్పష్టంగా కనిపించింది. నిజానికి రామ్ దాస్ అధవలే మాత్రమే కాదు.. 19 మందిలో దాదాపు ఆరుగురికి పైనే నేతలు ప్రమాణస్వీకారం సందర్భంగా తడబాటుకు గురి కావటం కనిపించింది.
Full View

Tags:    

Similar News