గోరక్షణ పేరు చెప్పి మాన హత్యలు చేస్తున్నారే

Update: 2016-07-30 10:14 GMT
కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. గో పరిరక్షణ పేరుతో.. ఇటీవల కాలంలో దాడులు చేస్తున్న వారికి చురుకు పుట్టేలా సంచలన వ్యాఖ్యలు చేశారు ఇటీవల కేంద్రమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన దళిత నాయకుడు రాందాస్ బాండు అథావాలె. గో రక్షణ పేరుతో దళితుల మీద దాడులు చేయటాన్ని ఆయన ప్రశ్నించారు. మనుషుల ప్రాణాల్నిపణంగా పెట్టి గోవుల రక్షణ చేయటం ఏ మాత్రం సరికాదన్న ఆయన.. ఇటీవల చోటు చేసుకున్న ఉనా ఘటనను తీవ్రంగా ఖండించారు.

గోవుల రక్షకులకు తాను చెప్పదలుచుకున్నది ఒక్కటేనని.. గోహత్యకు వ్యతిరేకంగా చట్టాలు ఉన్నాయని.. కానీ అందుకు భిన్నంగా గో రక్షణ పేరుతో మానవ హత్యలు చేయటంలో అర్థం ఏమిటంటూ ప్రశ్నించారు. ‘‘గోవుల్ని రక్షిస్తున్నారు సరే. మరి.. ఇప్పుడు మనుషుల్ని ఎవరు రక్షిస్తారు?’’ అంటూ అడగాల్సిన ప్రశ్ననే అడిగారు. కేంద్ర సామాజిక న్యాయం.. సాధికారిత శాఖ సహాయమంత్రిగా వ్యవహరిస్తున్న అథావాలె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి.

గుజరాత్ లో చోటు చేసుకున్న ఉనా తరహా ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇటీవలే గుజరాత్ లోని ఉనాలో ఆవు చర్మాన్ని వలిచారంటూ దళిత యువకుల్ని కారుకు కొట్టేసి గోరక్షకులు దారుణంగా కొట్టిన ఘటన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రమంత్రి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు చర్చగా మారాయి.
Tags:    

Similar News