ఆ కేంద్రమంత్రి కామెడీగానా - సీరియస్ గానా!

Update: 2019-11-18 12:50 GMT
మోడీ కేబినెట్లో ఉండే మంత్రుల్లో చాలా మంది నోళ్లు మెదపడానికే భయపడతారు. విధానపరమైన అంశాల గురించి మాట్లాడేందుకు కూడా వారిలో కొందరికి జంకు. అయితే అదే మంత్రివర్గంలో ఒకరిగా ఉంటున్న రాందాస్ అఠవాలే మాత్రం వారందరికీ భిన్నం. తనకు తోచినట్టుగా మాట్లాడగలరు ఈ మంత్రిగారు.

సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా అఠవాలే ఆసక్తిదాయకమైన ప్రకటనలు చేశారు.ఆఖరికి ఏపీ వ్యవహారాల గురించి కూడా ఆయన స్పందించారు. భారతీయ జనతా పార్టీకి ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుందని అఠవాలే ప్రకటించి ఆశ్చర్యపరిచారు. అంతజేసీ ఈయన బీజేపీ ఎంపీ ఏమీ కాదు.

ఉందో లేదో తెలియని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఒక గ్రూపు ఈయనది. ఆర్పీఐ(ఏ) అనే పార్టీకి చెందిన ఎంపీ. సోలో ఎంపీ - సోలో గా కేంద్రమంత్రి కూడా అయ్యారు. మోడీ మంత్రివర్గంలో రెండోసారి మంత్రి అయ్యారు. సామాజిక న్యాయం - సాధికారత శాఖ మంత్రి ఈయన.

ఇక తరచూ ఏదో రకంగా ఆసక్తిదాయకమైన కామెంట్లు చేసే అఠవాలే.. తన సొంత రాష్ట్రం మహారాష్ట్ర రాజకీయాల మీద కూడా ఒక కామెంట్ పాస్ చేశారు. అదేమిటంటే..మహారాష్ట్రలో బీజేపీ-శివసేనల ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

అంతకన్నా ఆసక్తిదాయకమైన అంశం ఏమిటంటే - ఆ విషయాన్ని స్వయంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షానే తన చెవిలో ఊదాడని ఈయన చెప్పుకొచ్చారు. ఒకవైపు బీజేపీ-శివసేనలు సిగపట్లు పడుతున్నాయి. ఫలితంగానే పరిస్థితి ఇక్కడి వరకూ వచ్చింది. అయితే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదే ఆ రెండు పార్టీలూ అంటూ ఈ కేంద్రమంత్రి ప్రకటించడం కామెడీనో - సీరియస్ గానో అర్థం కావడం లేదని పరిశీలకులు అంటున్నారు. అమిత్ షా పేరును కూడా ఈయన ప్రస్తావించేశారు. దీంతో బీజేపీ కూడా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Tags:    

Similar News