పెట్రోల్ ధ‌ర‌ల‌పై మోడీ మంత్రి ఎట‌కారం!

Update: 2018-09-16 04:20 GMT
ఆకాశ‌మే హ‌ద్దుగా దూసుకెళుతున్న పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లపై దేశ వ్యాప్తంగా మోడీ స‌ర్కారుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ చెప్పిన దానికి..ఇప్పుడు జ‌రుగుతున్న దానికి ఏ మాత్రం సంబంధం లేని తీరును కోట్లాదిమంది త‌ప్పు ప‌డుతున్నారు.

మోడీ జ‌మానాకు ముందు.. లీట‌రు పెట్రోల్ వంద‌కు చేరుకోవ‌టం మ‌రో ప‌దేళ్లు ప‌డుతుంద‌న్న అభిప్రాయం ఉండేది. మోడీ పుణ్య‌మా అని.. మ‌రో మూడు నెల‌ల‌ వ్య‌వ‌ధిలో ఆ మార్క్ దాటిపోతుంద‌న్న ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తొంభై ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేసిన పెట్రోల్ ధ‌ర‌ల‌పై సామాన్యుడు విల‌విల‌లాడుతున్నారు.

అంత‌ర్జాతీయ మార్కెట్ లో ముడి చ‌మురు ధ‌ర‌లు మండిపోకున్నా.. అంత‌కంత‌కూ పెంచేస్తున్న మోడీ స‌ర్కారు తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్ ధ‌ర‌ల్ని చూస్తున్న సామాన్యుల గుండె గుభేల్ మంటోంది. మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవి ఆందోళ‌న‌కు అంతే లేదు. ఇలాంటి వేళ‌.. ఓదార్పు మాట‌ల స్థానే.. ఎట‌కారం రావ‌టంపై ప‌లువురు మండిప‌డుతున్నారు.

ఎంత అధికారంలో చేతిలో ఉంటే మాత్రం మ‌రీ.. ఇంత దారుణంగా మాట్లాడ‌తారా? అన్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. పెట్రోల్ ధ‌ర‌లు పెర‌గ‌టంపై కేంద్ర స‌హాయ మంత్రి రామ్ దాస్ ఆఠ‌వాలే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు పెట్రోల్ ధ‌ర‌ల‌పై ఆందోళ‌న లేద‌ని.. ఎందుకంటే తాను మంత్రిన‌ని.. త‌న‌కు పెట్రోల్ ఉచితంగా వ‌స్తోంద‌న్నారు. తాను మంత్రి ప‌ద‌విలో లేకుండా అప్పుడు పెట్రోల్ ధ‌ర‌ల గురించి ఆలోచిస్తాన‌న్న మాట‌ల‌పై ప‌లువురు ఫైర్ అవుతున్నారు.

ఎంత మంత్రిప‌ద‌విలో ఉంటే మాత్రం మ‌రీ ఇంత ఎట‌కార‌మా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌జ‌లు క‌ట్టే ప‌న్నుల‌తో సౌక‌ర్యాల్ని ఎంజాయ్ చేస్తున్న కేంద్ర‌మంత్రికి.. స‌గ‌టు జీవి క‌ష్టం మీద మ‌రీ ఇంత చుల‌క‌నా? అన్నది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. పెట్రోల్ ధ‌ర‌లపై ప్ర‌జ‌ల‌కు మంట పుట్టేలా మాట్లాడిన కేంద్ర‌మంత్రి.. చివ‌ర్లో మాత్రం.. పెరిగిన ధ‌ర‌ల్ని త‌గ్గించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న మాట చెప్పారు. అనాల్సిన మాట అనేసి..చివ‌ర్లో ఏం మాట్లాడితే ఏం లాభం..? చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కూ ఏ ప్ర‌భుత్వ హ‌యాంలో లేని విధంగా భారీగా పెరిగిన పెట్రోల్ ధ‌ర‌ల‌పై అధికార‌ప‌క్షానికి ఆందోళ‌న కంటే కూడా కోట్లాది మంది క‌ష్టం కామెడీగా మారిన‌ట్లుగా అఠ‌వాలే మాట‌లు అనిపించ‌ట్లేదు?  అంద‌రి మాట‌ల్ని ప్ర‌జ‌లు వింటున్నార‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు సుమా!


Tags:    

Similar News