మార్కెట్లోకి రాందేవ్ బాబా జీన్స్

Update: 2016-09-10 08:47 GMT
ప‌తంజ‌లి పేరుతో దేశంలోని వ్యాపార మార్కెట్‌ లోకి ప్ర‌వేశించిన ప్ర‌ముఖ యోగా గురువు బాబా రాందేవ్.. ప్ర‌జ‌ల అభిరుచుల‌కు అనుగుణంగా ఫ‌క్తు వ్యాపారిగా ఆయ‌న మారిపోయారు. ఇప్ప‌టి వ‌ర‌కు పేస్ట్ - పొడులు - స‌రుకులు వంటి వంటింటి స‌రుకులు దాదాపు 800 ర‌కాల ఉత్ప‌త్తుల‌కు ప‌రిమిత‌మైన ప‌తంజ‌లి సంస్థ‌.. ఇక‌పై ప్ర‌జ‌ల అభిరుచుల‌కు అనుగుణంగా జీన్స్ స‌హా అన్ని ర‌కాల వ‌స్త్రాల‌ను దేశీయంగా త‌యారు చేయించి మార్కెట్ చేసేందుకు రెడీ అయింది. అంతేకాకుండా.. ప‌తంజ‌లి ప్రొడ‌క్ట్స్‌ను ఒక్క భార‌త్‌ కే ప‌రిమితం చేయ‌కుండా ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా అందుబాటులోకి తేనున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా బాబా రాం దేవ్ వెల్ల‌డించారు.

పురుషులకు - మహిళలకు ఇద్దరకూ అనువైన బట్టలను తయారుచేయనున్నామని రాందేవ్ తెలిపారు. కేవలం భారతీయ సంప్రదాయ దుస్తులనే కాక - జీన్స్ లాంటి మోడ్రన్ దుస్తులు కూడా తయారుచేయనున్నట్టు ప్రకటించారు. దేశీ జీన్స్ పేరుతో మార్కెట్లోకి ప్రవేశించబోతున్నామని తెలిపారు. లుథియానాలో మంచి తయారీదారులు ఉన్నారని, ఇతర చేనేత సెంటర్లు ఈ దుస్తులను డిజైన్ చేయనున్నట్టు చెప్పారు.  క‌మ‌ర్షియ‌ల్‌ జీన్స్ - ఆఫీసులకు అనుగుణమైన బట్టలను అందించనున్న‌ట్టు తెలిపారు. త‌మ ఉత్ప‌త్తుల‌కు అన్ని ప‌క్షాల నుంచి ఆద‌ర‌ణ పెరుగుతోంద‌ని చెప్పారు. వీటి వ‌ల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవ‌కాశం లేద‌న్నారు.

ఇక‌, ప‌తంజ‌లి మార్కెట్ విస్త‌ర‌ణ‌పై మాట్లాడుతూ.. ఇప్పటికే నేపాల్ మార్కెట్లో తాము ప్రవేశించామని, బంగ్లాదేశ్ అనంతరం ఆఫ్రికా మార్కెట్ లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. దేశీయ మార్కెట్ పరిస్థితులతో సరితూగే ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మొదట తమ వ్యాపారాల వృద్ధి చేపడతామని రాందేవ్ ఆశాభావం వ్యక్తంచేశారు. స్టేజ్2 అనంతరం యూరప్ - అమెరికా వంటి అభివృద్ధి చెందిన మార్కెట్లలో బహుళ జాతీయ కంపెనీలతో పోటీకి సిద్ధమవుతామని ప్రకటించారు. దీంతో ప‌తంజ‌లి.. మార్కెట్ ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త‌రించ‌నుంద‌న్న‌మాట‌.
Tags:    

Similar News