జగన్ కు రామోజీ ఆ మాట చెప్పారా?

Update: 2015-09-25 11:30 GMT
రామోజీ ఫిలిం సిటీ అడ్డాగా తెలుగు రాజకీయాల్ని ప్రభావితం చేసే ఒక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రామోజీ సంస్థల గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు ఇంటికి.. ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లి భేటీ కావటం తెలిసిందే.

గుంటూరులో ఈ నెల 26న ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేయటానికి సరిగ్గా రెండు రోజుల ముందు రామోజీని కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓ వైపు దీక్ష చేసేందుకు సైతం ససేమిరా అంటూ ఏపీ సర్కారు తేల్చి చెబుతుంటే.. మరోవైపు ‘రాజకోటలో రాజగురువు రాజకీయాలు చేస్తుంటాడు’ అంటూ తన పత్రికలో పెద్ద పెద్ద అక్షరాల్లో అచ్చేయించిన జగనే.. ఇప్పుడు అదే రాజకోటకు.. అదే రాజగురువును కలిసేందుకు వెళ్లటం కాస్త చిత్రమైన విషయమే.

ఈ భేటీ సందర్భంగా వారిద్దరూ ఏం మాట్లాడుకున్నది బయటకు రాలేదు. కాకుంటే.. విశ్వసనీయ వర్గాల ప్రకారం జగన్ ను ఉద్దేశించి రామోజీరావు చేసిన ఒక వ్యాఖ్య మాత్రం బయటకు వచ్చింది. ఇందులో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా.. ఆ వ్యాఖ్యను చూస్తే.. జగన్ అనిపించుకునేంత.. రామోజీ అనేంత స్థాయిలోనే ఉందని చెప్పక తప్పదు.

‘‘నీకు చాలా భవిష్యత్తు ఉంది. ఆవేశం తగ్గించుకో’’ అంటూ జగన్ ను ఉద్దేశించి రామోజీరావు వ్యాఖ్యానించారన్న మాట బయటకు వచ్చింది. సాపేక్షంగా చూస్తే.. జగన్ భవిష్యత్తు దివ్యంగా ఉందని రామోజీ సెలవిచ్చినట్లేనని చెప్పక తప్పదు. ఆవేశం తగ్గించుకో అన్న మాటలో ప్రతికూలత కంటే సానుకూలతగానే చెప్పుకోవాలి. తన దగ్గరకు స్నేహహస్తం చాచిన ఎవరితోనూ వైరం పెట్టుకోవటానికి.. బిగుసుకుపోవటానికి రామోజీ ఏమీ రాజకీయనేత కాదు. ఆయనో వ్యాపారవేత్త. జీవితంలో ఎత్తుపల్లాలు.. ఆటుపోట్లు చూసిన వ్యక్తి. అలాంటి ఆయన శత్రుత్వం కంటే.. మిత్రుడిగా ఉండిపోవటానికే ఇష్టపడతారు. అది జగన్ తో అయినా.. మరెవరితోనైనా.

అలాంటి రామోజీని జగన్ కలిసినప్పుడు.. తాను అంతవరకూ విన్న దానికి.. చూసిన దానికి భిన్నమైన వాతావరణం కనిపించే ఉంటుంది.  తన దగ్గరకు వచ్చిన వారిని ఉద్దేశించి చులకన చేసి మాట్లాడటం లాంటివి రామోజీ వైఖరికి పూర్తి భిన్నం. తన ఇంటికి వచ్చిన వారికి మర్చిపోలేని అతిధ్యం ఇచ్చి పంపే అలవాటు ఉన్న రామోజీ.. జగన్ కు అలాంటి మర్యాదే చేసి పంపి ఉంటారు. ఈ సందర్భంలోనే ఆవేశం తగ్గించుకో.. మంచి భవిష్యత్తు ఉందన్న మాట అని ఉండొచ్చు.నిజానికి రామోజీ నోటి నుంచి అలాంటి మాట ఒకటి కానీ వస్తే.. జగన్ కు అంతకు మించి కావాల్సిందేముంది..?
Tags:    

Similar News