కేసీఆర్‌ కు షాకిస్తూ సిట్టింగ్ ఎమ్మెల్సీ బైబై

Update: 2018-09-22 06:31 GMT
టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ముంద‌స్తు ఎపిసోడ్ ఆదిలోనే చుక్క‌లు చూపిస్తోంది. ఓ వైపు ఎన్నిక‌లు ఎదుర్కోవాల్సిన ప‌ర్వం ఉండ‌టగా...అంత‌లోగానే  టీఆర్‌ ఎస్ పార్టీలో అసమ్మతి సెగలు ఎగసిపడుతునే ఉన్నాయి. అధిష్ఠానం ఊహించని విధంగా పార్టీ ముఖ్య నేతలు ఒకొక్కరూ అసమ్మతి బాట పడుతున్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత అసంతృప్తి వ్యక్తం కావడం మామూలెనని - నాలుగైదు రోజుల తర్వాత అంతా సర్దుకుంటుందని టీఆర్‌ ఎస్ అధిష్ఠానం భావించిన‌ప్ప‌టికీ అభ్యర్థులను ప్రకటించి రెండు వారాలు గడుస్తున్నా అసమ్మతి రోజు రోజుకు పెరగడమే తప్ప తగ్గేలా కనిపించక పోవడం పట్ల హైకమాండ్ ఆందోళన చెందుతోంది. తాజాగా టీఆర్‌ ఎస్ వ్యవస్థాపక సభ్యుడు - ఎమ్మెల్సీ రాములు నాయక్ తిరుగుబాటు బావుటా ఎగరేయడం ఆ పార్టీలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

మెదక్ జిల్లా నారాయణఖేడ్ నుంచి టిక్కెట్ ఆశించిన రాములుకు టికెట్ దక్కక పోవడంతో పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. ఏకంగా కీల‌క స‌మావేశంలో ఈ మేర‌కు ప్ర‌క‌టించారు. వచ్చే ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని డిసైడ‌య్యారు. ఎమ్మెల్యే క్వార్ట‌ర్స్‌ లోని తన అధికారిక నివాసంలో గిరిజన సంఘాలతో పాటు ఉద్యోగ - వైద్య - న్యాయవాద - విద్యార్థి సంఘాల‌తో జరిగిన సమావేశంలో రాములు నాయక్ కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. టీఆర్‌ ఎస్ ప్రభుత్వం గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని - పైగా రిజర్వేషన్ల పెంపు అంశాన్ని మైనార్టీల రిజర్వేషన్లతో చేర్చి మరింత జటిలం చేసిందని సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెరిగిన గిరిజన జనాభా దామాషాకు అనుగుణంగా ఫలాలు అందడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే అంతో ఇంతో తమ వర్గాలకు మేలు జరిగిందని అభిప్రాయపడ్డారు. టీఆర్‌ ఎస్ ఇచ్చిన హామీలను నమ్మి గత ఎన్నికల్లో గిరిజనులంతా మద్దతు ఇచ్చి గెలిపిస్తే - తమకు దక్కింది ఏమి లేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. జనరల్ సీట్లలో కనీసం 20 స్థానాల్లో గెలుపు - ఓటములను ప్రభావితం చేయగల స్థాయిలో తమ జనాభా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ మద్దతు లేకుండానే స్వతంత్రంగా 20 స్థానాలలో పోటీ చేయాలని ఈ సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు రాములు నాయక్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. తన ఎమ్మెల్సీ పదవికి రెండు మూడు రోజులలో రాజీనామా చేయాలని రాములు నాయక్ భావిస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం.
Tags:    

Similar News