మాజీ హీరోయిన్ కు పాకిస్థాన్ బాగా నచ్చిందట

Update: 2016-08-23 15:30 GMT
క‌న్న‌డ సినీన‌టి - మాజీ ఎంపీ రమ్యపై  దేశద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే. కన్నడ - తమిళ - తెలుగు సినిమాలతో బాగా పాపులర్ అయిన రమ్య ఆ తరువాత 2011లో కాంగ్రెస్ లో చేరి ఎంపీగా గెలిచారు.   ఇటీవ‌లే ఆమె పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ లో నిర్వహించిన సార్క్ దేశాల యువ నేతల సదస్సుకు వెళ్లి వచ్చారు.. వచ్చాక ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కొందరు అనుకుంటున్నట్లు పాక్ ఏమీ నరకం కాదని.. తమను బాగా చూసుకున్నారని పొగడ్తలు కురిపించారు. దీంతో ఆమెపై కర్ణాటకలోని మదికేరీలో కత్నమణె విట్టల్‌ గౌడ అనే న్యాయవాది దేశ ద్రోహం కేసు పెట్టారు. వ‌చ్చే శ‌నివారం కోర్టు ఈ కేసులో వాద‌న‌లు విన‌నుంది.  అయితే... అదే సమయంలో  భార‌త హోం మంత్రి రాక‌ను నిర‌సిస్తూ పాక్ నిర‌స‌నలు తెలిపిన వేళ - మన రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్ పాకిస్థాన్‌ ను నరకంతో పోల్చిన సంగతి తెలిసిందే.. అందుకు భిన్నంగా రమ్య అదేమీ నరకం కాదంటూ ఇండైరెక్టుగా పారికర్ కు కౌంటర్ వేశారు.

అయితే.. రాజకీయాల్లో విమర్శలు - ఆరోపణలు అన్నీ బాగా అలవాటైపోయిన రమ్య ఏమాత్రం వెనక్కు తగ్గలేదు.  తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పబోనని ఖరాకండీగా చెబుతున్నారు.. తాను ఎలాంటి తప్పుచేయలేదని, తన సొంత అభిప్రాయాలను మాత్రమే చెప్పానని తెలిపారు. సొంత అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ప్రజాస్వామ్య దేశంలో ప్రతిఒక్కరికీ ఉంటుందని రాజ్యాంగాన్ని వల్లెవేసింది. అయితే.. పాకిస్థాన్ లాంటి స్వర్గధామంలో నివసిస్తారా అని కొందరు చురుకైన విలేకరులు ప్రశ్నించగా మాత్రం ఆమె కొట్టిపారేసింది.  తాను భారతదేశాన్ని మాత్రం విడిచిపెట్టి ఎక్కడికీ వెళ్లబోనని స్పష్టం చేశారు. తాను తన ఇంటిని.. తాను పెంచుకునే కుక్కలను కూడా వదిలి ఎటూ వెళ్లనని తెలిపారు.

కాగా రమ్య ఎంపీగా ఉన్న కాలంలో తన నియోజకవర్గంలో ప్రజలను పట్టించుకోకపోవడం.. ఎన్నికలప్పుడు కూడా స్థానిక నేతలను కూడా కనీసం కలవకపోవడంపై కన్నడ కాంగ్రెస్ నేతలు అప్పట్లో అధిష్ఠానానికి కూడా ఫిర్యాదులు చేశారు. అయినా.. రమ్య మాత్రం తన పద్ధతిలోనే తాను వెళ్లేవారు. రమ్య తాజాగా విమర్శలకు గురవుతుండడంతో కర్ణాటకలో ఆమెను వ్యతిరేకించే కాంగ్రెస్ నేతలు మళ్లీ గళం విప్పుతున్నారు. రమ్య తన నియోజకవర్గ ప్రజలను పట్టించుకోదు కానీ తన పెంపుడు కుక్కలను మాత్రం బాగా చూసుకుంటుందంటూ వారు సెటైర్లు వేస్తున్నారు.
Tags:    

Similar News