`ఐల‌య్య‌` మంట‌ల‌కు కాంగ్రెస్ ఆజ్యం పోస్తోందే!

Update: 2017-09-26 06:28 GMT
కంచె ఐలయ్య‌! గ‌త కొన్ని రోజులుగా ఏపీ - తెలంగాణ రాష్ట్రాల్లోని వైశ్యుల‌కు కంటిపై కునుకు ప‌ట్ట‌నివ్వ‌కుండా చేస్తున్నవివాదానికి మూల‌కార‌ణ‌మైన వ్య‌క్తి! భావ ప్ర‌క‌ట‌న పేరుతో ఓ వ‌ర్ణానికి చెందిన వారిని స్మ‌గ్ల‌ర్లుగా చిత్రీక‌రించిన ఫ‌లితంగా త‌లెత్తుతున్న భారీ వివాదానికి నేడు ఇరు రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వాలు ఫుల్ స్టాప్ పెట్ట‌లేక నానా తిప్ప‌లు ప‌డుతున్నాయి. దానంత‌ట అదే చ‌ల్లారుతుందిలే అని ఎవ‌రు ఎలాంటి కామెంట్లు చేసుకున్నా ఇటు ఏపీలో అధికార పార్టీ కానీ, అటు తెలంగాణ‌లో అధికార పార్టీ కానీ మౌనంగానే ఉన్నాయి. అయితే, ఈ విష‌యంలో పెద్ద‌న్న‌గా ఇప్పుడు జోక్యం చేసుకున్న అతిపెద్ద జాతీయ పార్టీ కాంగ్రెస్‌..దీనిని అనూహ్య‌మైన మ‌లుపుతిప్పే ప్ర‌య‌త్నం చేసింది.

ఏక‌ప‌క్షంగా ఐల‌య్య‌ను వెనుకేసుకు రావ‌డంతో ఎస్సీ - ఎస్టీ - బీసీ - ఓబీసీ వ‌ర్గాల‌కు చేరువ కావాల‌ని ఓ ప్లాన్ వేసింది. దీనిని వెంట‌నే అమ‌లు కూడా చేసేసింది. ఓబీసీ - దళిత  హక్కుల కోసం పోరాడుతున్న సామాజిక వేత్త - రచయిత - ఫ్రోఫెసర్‌ కంచె ఐలయ్యను దూషిస్తూ జరగుతున్న దాడిని పిరికిపందల చర్యగా భావిస్తున్నామని ఏఐసీసీ సమాచార వ్యవహారాల ఇంచార్జ్‌ రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా  పెద్ద ఎత్తున ప్ర‌క‌ట‌న చేసి ఈ వివాదాన్ని మ‌రింత పెంచేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికీ భావప్రకటన స్వేచ్చఉందన్నారు. మేధావుల గొంతు నొక్కి తార్కిక వాదుల ఆలోచనలపై నిరంతరం జరుగుతున్న దాడులు దారుణమని చెప్పుకొచ్చారు.

సెప్టెంబర్‌ 24న తెలంగాణ‌లోని పరకాలలోని అంబేద్కర్‌ సెంటర్‌ వద్ద ఫ్రోఫెసర్‌ కంచె ఐలయ్య వాహనంపై రాళ్లు - చెప్పులతో దాడి చేయించడం దారుణ‌మ‌ని సూర్జేవాలా చెప్పుకొచ్చారు. ఈ ప‌రిణామంతో  ఇరు రాష్ట్రాల్లోని వైశ్యులు తీవ్రంగా మండిప‌డుతున్నారు. జాతీయ పార్టీ ఏదైనా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే దిశ‌గా మార్గం చూపాల‌ని - అయితే, ఏక‌ప‌క్షంగా ఐలయ్య‌ను వెనుకేసుకు వ‌స్తూ.. ఇలా మాట్లాడ‌డం ఎంత మేర‌కు స‌మంజ‌స‌మ‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ వివాదానికి మ‌రింత ఆజ్యం పోసి చ‌లికాచుకోవాల‌ని కాంగ్రెస్ భావిస్తోందా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌తి దానినీ ఎన్నికల కోణంలోనే చూడ‌డం ఎంత‌మేర‌కు సమంజ‌స‌మ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. నిజానికి హేతువాదులు సైతం ఐల‌య్య వైశ్యుల‌పై వాడిన భాష‌ను ఖండిస్తుంటే.. ప్ర‌స్తుతం కాంగ్రెస్ ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం ఎంత వ‌ర‌కు సమంజ‌స‌ని అడ‌తున్నారు. మ‌రి కాంగ్రెస్ ఏం స‌మాధానం చెబుతుందో చూడాలి.
Tags:    

Similar News