జగన్ పై ప్రశంసలు: పవనో రూటు.. ఆయన ఎమ్మెల్యేది మరో రూటు

Update: 2020-02-27 09:48 GMT
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భిన్న రాజకీయాలు చోటుచేసుకున్నాయి. ఒకాయన ప్రభుత్వ తీరుకు పోరాడకుండా ప్రతిపక్ష పార్టీపై పోరాడి అభాసుపాలయ్యాడు. ఎన్నికల ఫలితాలను చూసి ఖంగు తిన్నాడు. అయినా ఆయన రెండుచోట్ల పోటీ చేసి దారుణగా ఓడిపోగా.. ఆయన పార్టీ నుంచి మాత్రం ఒకాయన ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ గెలిచిన ఆయన ఏనాడు ఆ పార్టీకి చెందిన వ్యక్తిగా ప్రవర్తించలేదు. ఇప్పుడంతా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆయన వ్యవహార శైలి ఉంది. పవన్ నిర్ణయాలకు విరుద్ధంగా అధికార పార్టీతో సన్నిహితంగా ఉన్నాడు. దీంతో పవన్ ఆ ఎమ్మెల్యేను పట్టించుకోవడమే మానేశాడు. తాజాగా ఆ ఎమ్మెల్యే జగన్ పాలనకు జై కొట్టాడు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన బాగుందని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ మరోసారి చెప్పారు. చిత్తూరు జిల్లాలోని తిరుమల శ్రీవారిని గురువారం ఆయన దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. విశాఖపట్నం రాజధానిగా ఉంటే గోదావరి ప్రాంతాల్లో వెనుకబడిన ప్రాంతాలన్ని అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరి జిల్లాలు అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు అవసరమని పేర్కొన్నారు. పవన్‌ కల్యాణ్‌, తాను ఈ మధ్య కాలంలో కలవలేదని.. ఆయన గురించి తనకు ఎటువంటి సమాచారం రాలేదని చెప్పారు.

అయితే ఈ సందర్భంగా పార్టీ గురించి మాట్లాడారు. తాను జనసేన పార్టీకి దూరంగా లేను.. దగ్గరగా లేను.. కేవలం జనసేన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని అర్థం కాని వ్యాఖ్య చేశారు. ప్రభుత్వ విధానాలు తనకు నచ్చితే నిర్మోహమాటంగా మద్దతు తెలుపుతానని స్పష్టం చేశారు.

అయితే జనసేన వ్యవస్థాపకుడిగా ఉన్న పవన్ కల్యాణ్ అధికార వికేంద్రీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతుండగా ఆయన పార్టీ ఎమ్మెల్యే మాత్రం మద్దతు తెలుపుతుండడం ఆశ్చర్యం. అయితే రాపాక అధికార పార్టీలో చేరేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి జగన్ కు మద్దతుగా మాట్లాడుతూనే ఉన్నారు. పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అయినా తర్వాత ఒకటి, రెండు సార్లు తప్ప పెద్దగా కలవలేదు.

పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా ఎమ్మెల్యే రాపాక వ్యవహార శైలి ఉండగా పవన్ ఏమాత్రం స్పందించడం లేదు. ఇద్దరు వేర్వేరు దారులు చూసుకున్నట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ వ్యవహార శైలి నచ్చక రాపాక ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. పవన్ పర్యటనలకు ఆయన హాజరుకావడం లేదు.. జనసేన పార్టీ ఎమ్మెల్యేను పిలవడం లేదు. ఈ విధంగా పవన్ రాజకీయ పార్టీ పరిస్థితి ఉంది.
Tags:    

Similar News