త్వరలోనే ఏపీలో కూడా హుజూర్ నగర్ తరహా ఉప ఎన్నిక?

Update: 2019-10-21 14:30 GMT
ఏపీలో కూడా ఉప ఎన్నిక ఒకటి ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైనా వారు తన పార్టీలోకి వస్తామంటే రాజీనామా షరతును పెట్టారు  ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. చంద్రబాబులా తను విలువల్లేని రాజకీయాలు చేయనని ఆయన తేల్చి చెప్పారు. తన పార్టీలోకి రావాలనుకునే వాళ్లు ఎమ్మెల్యే పదవికి  రాజీనామా చేసి తీరాల్సి ఉంటుందని జగన్ స్పష్టం చేశారు.

ఈ క్రమంలో ఏపీలో ఒక ఉప ఎన్నిక ఖరారు అనే ప్రచారం జరుగుతూ ఉంది. అది రాజోలు నియోజకవర్గానికి జరుగుతుందని సమాచారం. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాజీనామా ఊహాగానాలు చెలరేగుతూ ఉన్నాయి. రాపాకను జనసేనలో బాగా అవమానిస్తూ ఉన్నారనే అభిప్రాయం జనాల్లో కూడా కలుగుతూ ఉంది.

పవన్ కల్యాణ్ ఎక్కడకు వెళ్లినా ఆయన వెంట రాపాక అంతగా కనిపించరు. జనసేన తరఫున చాలా మందే పోటీ చేశారు. అయితే వారు నెగ్గలేకపోయారు. గెలిచింది రాపాక మాత్రమే. పవన్ కల్యాణ్ కూడా రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినా, రాపాక మాత్రం విజయం సాధించారు. అయితే ఆయనకు పవన్ అంత ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా కనిపించదు.

ఇటీవల అయితే మరీ దారుణంగా పవన్ కల్యాణ్ సమక్షంలో రాపాక వరప్రసాద్ కు అవమానం జరిగింది. పార్టీలో ఉండి, కనీసం  ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయిన నాదెండ్ల మనోహర్ ఆయనను అవమానించారు. ఒక మీటింగుకు రాపాక ఆలస్యంగా రావడంతో.. నాదెండ్ల గట్టిగా మాట్లాడారు. ఆయనను అవమానించారు. 'బొట్టు పెట్టి పిలవాలా?' అంటూ మాట్లాడారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.

ఈ  పరిణామాల్లో రాపాక జనసేనకు రాజీనామా చేయవచ్చని,  దాంతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవచ్చనే ప్రచారం సాగుతూ ఉండటం గమనార్హం. దీంతో ఏపీలోనూ ఒక సీటుకు ఉప ఎన్నిక రాబోతోందనే టాక్ నడుస్తూ ఉంది.
Tags:    

Similar News