వివాహిత‌పై రేప్.. సీఐ రిమాండ్ రిపోర్టులో సంచ‌ల‌న విష‌యాలు!

Update: 2022-07-14 04:09 GMT
హైద‌రాబాద్ లో మారేడుప‌ల్లి సీఐ నాగేశ్వ‌ర‌రావు వ‌న‌స్థ‌లిపురంలో ఓ మ‌హిళ‌ను రివాల్వ‌ర్ తో బెదిరించి అత్యాచారానికి పాల్ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఓ చీటింగ్ కేసులో ఆమె భ‌ర్త‌ను అరెస్టు చేసిన సీఐ దాన్ని అడ్డుపెట్టుకుని అత‌డి భార్య‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఇదేమిట‌ని ప్ర‌శ్నించిన మ‌హిళ భ‌ర్త‌ను కొట్టి, కాల్చి చంపుతాన‌ని బెదిరించార‌ని భార్యాభర్త‌లిద్ద‌రూ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే, దీంతో అత‌డిని స‌స్పెండ్ చేస్తూ క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ నిర్ణ‌యం తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. అత్యాచారం, అపహరణ, హత్యాయత్నం, ఆయుధ నిరోధక చట్టం కింద నాగేశ్వ‌ర‌రావుపై వనస్థలిపురం పోలీసులు కేసులు నమోదు చేశారు.

తాజాగా ఈ కేసులో పోలీసులు మాజీ సీఐ నాగేశ్వ‌ర‌రావుపై రిమాండ్ రిపోర్టులో సంచ‌ల‌న విష‌యాలు పేర్కొన్నారు. హైద‌రాబాద్ న‌గ‌ర టాస్క్ ఫోర్స్ విభాగంలో ఎన్నో కీల‌క కేసుల‌ను ఆయ‌న ఛేదించారు. డ్ర‌గ్సు స్మ‌గ్ల‌ర్ల‌ను పట్టుకున్నారు. అలాగే ఉగ్ర‌వాదుల నెట్వ‌ర్కును గుర్తించారు. ప‌రారీలో ఉన్న ఎంతోమంది క‌ర‌డుగ‌ట్టిన నేర‌గాళ్ల‌ను అరెస్టు చేశారు. ఇలా మంచి పేరున్న మాజీ సీఐ నాగేశ్వ‌రరావు వివాహిత‌ను రేప్ చేయ‌డం ద్వారా ఆ పేరంతా పోగొట్టుకున్నారు.

బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె వాంగ్మూలం తీసుకున్నారు. అత్యాచారం జరిగిన గదిలో వెంట్రుకలు, దుప్పటి, గాజులు క్లూస్‌ టీమ్‌ స్వాధీనం చేసుకుంది. నాగేశ్వరరావును బాధితురాలి భర్త కొట్టిన కర్రతోపాటు అత్యాచార సమయంలో బాధితురాలి దుస్తులు స్వాధీనం చేసుకుని వాటిని ఫోర్సెనిక్ ల్యాబుకు పంపారు.

బాధితురాలి ఇంటి సమీపంలో ఉన్న ఎలక్ట్రిక్‌ షాపులోని సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. ఇబ్రహీంపట్నం మార్గంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో మాజీ సీఐ నాగేశ్వరరావు కారు వెళ్లినట్టు రికార్డయింది. దీంతో సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. కారును, బాధితురాలి సెల్‌ఫోన్‌ను సీజ్‌ చేశారు. ఘటన జరిగిన తర్వాత బాధితురాలిని, అమె భర్తను బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్తుండగా ఇబ్రహీంపట్నం వద్ద కారు ప్రమాదానికి గురైంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులకు.. తాను ఆక్టోపస్‌ అధికారినని, కానిస్టేబుల్‌తో కలిసి వెళ్తుండగా కారు ప్రమాదం జరిగిందని నాగేశ్వరరావు తప్పుడు సమాచారం ఇచ్చాడు. రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి పరిశీలించారు. కారు ప్రమాదం జ‌రిగాక నాగేశ్వ‌ర‌రావు త‌న‌ వద్ద పనిచేసే హోం గార్డు ప్ర‌వీణ్ కు సమాచారం ఇవ్వడంతో అతడు ఆ కారును చంపాపేట్‌కు తరలించాడు. ఈ నేప‌థ్యంలో హోంగార్డ్‌ ప్రవీణ్‌ స్టేట్‌మెంట్‌ను కూడా పోలీసులు రికార్డు చేశారు.

అత్యాచారం చేశాక నాగేశ్వరరావు తన బట్టలు స్వయంగా ఉతుక్కున్నాడని, ఏమీ తెలియనట్టు మారేడ్‌పల్లి పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి విధులు కూడా నిర్వహించ‌డం గ‌మ‌నార్హం. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకుని బెంగళూరుకు పారిపోయాడు. కొత్తపేటలోని గ్రీన్‌ హిల్స్‌ కాలనీలో ఆయ‌న‌ నివాసంలో సోదాలు నిర్వహించిన పోలీసులు.. అత్యాచార సమయంలో వేసుకున్న బ‌ట్ట‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు.

జూలై 10న నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో ఆయ‌న‌కు వైద్య పరీక్షలు నిర్వ‌హించారు. కొవిడ్‌, లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించిన అనంతరం హయత్‌నగర్‌ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు రిమాండ్‌ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.
Tags:    

Similar News