రేప్ బాధితుల్ని గుర్మిత్ శిష్య‌గ‌ణం చంపేస్తారా?

Update: 2017-08-26 06:57 GMT
దేశంలో బాబాల‌కు.. స్వాముల‌కు కొద‌వ‌లేదు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో స్వామి ఫేమ‌స్ గా చెబుతుంటారు.  అలాంటి స్వాములోరి మీద ఆరోప‌ణ‌లు ఉన్నా.. ఆయ‌న్ను ఫాలో అయ్యే వారికి అలాంటివేమీ పెద్ద‌గా ప‌ట్ట‌వు. ఎవ‌రి దాకానో ఎందుకు.. మ‌న‌కు బాగా తెలిసిన నిత్యానంద స్వామి రాస‌లీల‌ల వ్య‌వ‌హారం వీడియోల రూపంలో బ‌య‌ట‌కు వ‌చ్చినా ఆయ‌న్ను అభిమానించే వారు.. ఆరాధించే వారెంద‌రో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

నిత్యానంద‌ను ప‌క్క‌న పెడితే ఉత్త‌రాదిన.. అందునా హ‌ర్యానా.. పంజాబ్ రాష్ట్రాల్లో బాగా ఫేమ‌స్ గుర్మిత్ రామ్ ర‌హీమ్ సింగ్ బాగా ఫేమ‌స్. అత‌డి మాట‌లు.. చేత‌ల‌కు అక్క‌డి ప్ర‌జ‌లు ఫిదా అయిపోతుంటారు. ఆ మ‌ధ్య‌న ఆయ‌న‌పై ఇద్ద‌రు సాధ్వీలను అత్యాచారం చేసిన ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. దాదాపు ప‌దిహేనేళ్ల క్రితం వ‌చ్చిన ఈ ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ జ‌రిపిన కోర్టు.. ఆయ‌న్ను దోషిగా తేలుస్తూ తీర్పును ఇచ్చింది.

ఎప్పుడైతే గుర్మిత్‌ను దోషిగా కోర్టు తేల్చిందో అప్ప‌టి నుంచి రెండు రాష్ట్రాలు అట్టుడికిపోతున్నాయి. అక్క‌డ తలెత్తిన హింసాకాండ‌లో ఇప్ప‌టికే ప‌లువురు మ‌ర‌ణించిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ హింస అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్న‌ట్లుగా చెబుతున్నారు. పంజాబ్‌.. హ‌ర్యానా రాష్ట్రాల్లో అస‌లేం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితినెల‌కొంద‌ని చెబుతున్న వాళ్లూ ఉన్నారు. తాము ఆరాధించే గుర్మిత్ ను దోషిగా తేల్చిన వైనం డేరా అనుచ‌రుల్లో తీవ్ర ఆగ్ర‌హాన్ని గురి చేసింది. ఈ కార‌ణంగా వారి హింసాకాండ‌లో ప‌లువురు మ‌ర‌ణించారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. గుర్మిత్ ను దోషిగా నిరూపించేందుకు కార‌ణ‌మైన ఇద్ద‌రు బాధిత‌రాళ్ల భ‌విష్య‌త్ ఏమిట‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. డేరా శిష్య గ‌ణం త‌మ‌ను బ‌త‌క‌నివ్వ‌ద‌న్న భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు గుర్మిత్ బాధిత మ‌హిళ‌లు. గుర్మిత్ అత్యాచారం చేశార‌ని ఆరోపిస్తున్న మ‌హిళలు ఇప్పుడు ఎక్క‌డ ఉన్నార‌న్న స‌మాచారం కూడా బ‌య‌ట‌కు పొక్క‌నివ్వ‌టం లేదు. గ‌డిచిన కొద్దిరోజులుగా వారు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గురి అవుతున్నార‌ని.. ప్రాణ‌భ‌యంతో బిక్కు బిక్కుమంటున్నారని.. ఒక‌వేళ తాము పెట్టిన కేసులో గుర్మిత్ కానీ నిర్దోషిగా బ‌య‌ట‌కు వ‌స్తే  తాము వేరే రాష్ట్రానికి వెళ్లిపోతామ‌ని బాధితురాళ్ల త‌ర‌ఫు వాదిస్తున్న న్యాయ‌వాది ఇప్ప‌టికే చెప్పారు.

ఇదిలా ఉంటే.. గుర్మిత్ బాధితురాలు తీర్పు రావ‌టానికి ముందు ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. తాము పెద్ద ప్ర‌మాదంలో ఉన్న‌ట్లుగా ఆమె చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. తాను స్వేచ్ఛ‌గా తిర‌గ‌లేక‌పోతున్నాన‌ని.. తానున్న ప‌రిస్థితుల మ‌ధ్య సుర‌క్షితంగా ఉన్నానంటే అది నిజాయితీగా ప‌ని చేసే అధికారుల వ‌ల్లేన‌ని ఆమె చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో గుర్మిత్ మీద ఆరోప‌ణ చేసిన బాధితురాళ్ల భ‌ద్ర‌త ప్ర‌శ్నార్థ‌కంగా మారింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News