రేపిస్టుకు.. బాధ తెలిసేలా.. 30 ఏళ్లు జైల్లో పెట్టండి.. క్ష‌మాభిక్ష కూడా వ‌ద్దు: సుప్రీం తీర్పు

Update: 2022-05-14 09:44 GMT
దేశంలో నానాటికీ పెచ్చ‌రిల్లుతున్న రేపిస్టుల‌కు.. సుప్రీం కోర్టు గ‌ట్టి వార్నింగే ఇచ్చింది. చిన్నారిపై జ‌రిగిన అత్యాచారం కేసులో రేపిస్టుకు విధించిన మ‌ర‌ణ శిక్ష‌ను ర‌ద్దు చూస్తూ.. ''బాధిత చిన్నారి వేద‌న తెలియా లంటే.. దోషిని చంపేయ‌డం ప‌రిష్కారం కాదు. అత‌నికి ఆ బాధ తెలిసేలా... శిక్ష విధించాలి! '' అంటూ.. సంచ‌ల‌న వ్యాఖ్యలు చేసింది. అంటే.. మ‌ర‌ణ శిక్ష ద్వారా చంపేయ‌డం వ‌ల్ల బాధ తెలియ‌ద‌ని పేర్కొంది. ఈ క్ర‌మంలో దోషికి దిగువ కోర్టు విధించిన మ‌ర‌ణ శిక్ష‌ను యావ‌జ్జీవ కారాగార శిక్ష‌గా మార్చింది.

అంతేకాదు.. మ‌ధ్య‌లో ఆయ‌న‌కు క్ష‌మాభిక్ష‌లు పెట్ట‌డం.. వంటివి చేయొద్ద‌ని.. తేల్చి చెప్పింది.  ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి విధించిన మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ సుప్రీం కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. కనీసం ముప్పయ్యేళ్ల వరకు నిందితుడిని విడుదల చేయడం, క్షమాభిక్ష పెట్టడం వంటి ఎలాంటి మినహాయింపులు ఉండవని పేర్కొంది.

ఈ మేర‌కు సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తులు జస్టిస్ ఏ.ఎమ్.ఖన్విల్కర్, దినేష్ మహేశ్వరి, సీ.టీ రవికుమార్‌లతో కూడిన అత్యున్న‌త స్థాయి ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.

ఏం జ‌రిగింది? ఎక్క‌డ  జ‌రిగింది?మధ్యప్రదేశ్‌లో, 2014లో బంధువు కూతురైన ఎనిమిదేళ్ల చిన్నారిపై ఒక వ్యక్తి హత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేయడంతోపాటు, బాలికను క్రూరంగా చంపేశాడు. ఇది అప్ప‌ట్టో  దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ ఘటనలో నిందితుడు నేరానికి పాల్పడ్డట్లు అన్ని సాక్షాలు లభించాయి. దీంతో అతడికి రాష్ట్ర హైకోర్టు మరణ శిక్ష విధించింది. సుదీర్ఘ విచార‌ణ‌ల అనంత‌రం.. దోషి చేసిన ప‌నిని తీవ్రంగా పేర్కొంది కోర్టు.

అయితే.. ఈమ‌ర‌ణ‌ శిక్షను రద్దు చేయాలని కోరుతూ నిందితుడి తరఫు లాయర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం మరణ శిక్షను రద్దు చేస్తూ, యావజ్జీవ శిక్షగా మార్చింది. నిందితుడి ఆర్థిక, సామాజిక అంశాల్ని, గతంలో ఏ నేర చరిత్ర లేదనే అంశాల్ని దృష్టిలో ఉంచుకుని ఈ తీర్పునిచ్చినట్లు చెప్పింది. అలాగే నిందితుడు చేసింది తీవ్ర నేరమే అయినా, దీన్ని అత్యంత అరుదైన కేసుగా పరిగణించలేమని, అందువల్లే మరణ శిక్షను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.

అదేస‌మ‌యంలో దోషికి బాధ తెలియాలంటే.. సంస్క‌ర‌ణ ముఖ్య‌మని..అందుకే.. జైలు శిక్ష‌ను విధిస్తున్న‌ట్టు పేర్కొంది. ఈ 30 ఏళ్ల కాలంలో గ‌వ‌ర్న‌ర్‌, రాష్ట్ర‌ప‌తి స‌హా.. ఎవ‌రి వ‌ద్ద‌కు క్ష‌మాభిక్ష పిటిష‌న్ పెట్టుకోకుండా.. అధికారులే బాధ్య‌త వ‌హించాల‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News