గులాబీ ఎమ్మెల్యే 'కారు' దూకుడు.. రెండున్నర నెలల పసికందు మృతి

Update: 2022-03-18 05:30 GMT
మితిమీరిన వేగం.. ఖరీదైన కారు స్టీరింగ్ చేతిలో ఉంటే.. రోడ్డు మీద వెళ్లాల్సిన కారు గాల్లో తేలిపోతూ ఉండటం చాలా సందర్భాల్లో చూశాం. తాజాగా ఇలాంటి ఉదంతమే ఒకటి హైదరాబాద్ మహానగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటిగా చెప్పే జూబ్లీహిల్స్ లో దారుణ ప్రమాదం చోటు చేసుకుంది.

గురువారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో జూబ్లీ హిల్స్ లో రోడ్డు దాటుతున్న ఒక మహిళను.. ఆమె చేతిలో ఉన్న పసిగుడ్డు ప్రాణాల్ని తీస్తే.. వారితో పాటు రోడ్డు మీద నడుస్తున్న మరికొందరిని గాయాల పాలు చేసిన పరిస్థితి. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఢీ కొట్టినట్లుగా చెబుతున్నారు.

మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు.. రోడ్డు దాటుతున్న మహిళను ఢీ కొట్టింది కాదు. దీంతో.. సదరు మహిళ చేతిలో ఉన్న రెండున్నర నెలలు పసి కందు నేల మీద పడి అక్కడికక్కడే మరణించింది. శిశువు తల్లికి గాయాల బారిన పడింది. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

ఈ దారుణ ఘటన జరిగినంతనే.. డ్రైవర్ అక్కడికక్కడే కారును వదిలేసి పరారయ్యాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ కారుకు ఎమ్మెల్యే స్టిక్టర్ అంటించి ఉండటం.. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారిది వాహనం కావటంతో పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ కేసును ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.

అయితే..వాహనాన్ని రోడ్డు మీద వదిలేసి వెళ్లిన నేపథ్యంలో.. ఆ కారు మీద ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించి ఉండటం.. సదరు కారు పాత నిజామాబాద్ జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కారుగా చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వేళలో అధికార పార్టీ ఎమ్మెల్యే కారులో ఎవరెవరు ఉన్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

దీని పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా చెప్పారు. ఇంతకీ ప్రమాదం చేసిన వేళలో ఈ కారులో ఎవరెవరు? ఉన్నారన్నది తేలాల్సి ఉంది.
Tags:    

Similar News