భార‌త పౌర‌స‌త్వంపై ర‌షీద్ తేల్చేశాడు

Update: 2018-05-28 16:33 GMT
రషీద్ ఖాన్.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్న పేరు. ఇటీవ‌లే ముగిసిన ఐపీఎల్ లో అత‌డి ప్ర‌ద‌ర్శ‌న భార‌త క్రికెట్ అభిమానుల్ని అబ్బుర‌ప‌రిచింది. క్రికెట్ వర్గాలకు చెందిన వాళ్లే కాదు.. సినిమా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా రషీద్ మీద ప్రశంసలు కురిపించేశారు. ట్విటర్లో ఎప్పుడూ సినిమా సంగతులే పంచుకునే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం రషీద్ ప్రదర్శనను కొనియాడ‌టం విశేషం. మరోవైపు రషీద్ ప్రదర్శనకు ముగ్ధులైన భారత అభిమానులు.. అతడికి మన దేశ పౌరసత్వం ఇవ్వాలంటూ కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు విన్నవించ‌గా.. ఆమె కూడా ఆస‌క్తిక‌ర రీతిలో స్పందించింది.

కానీ భార‌త అభిమానుల కోరిక‌ను ర‌షీద్ ఖాన్ మ‌న్నించ‌లేదు. తాను అఫ్గానిస్థాన్ లోనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశాడు. ముందుగా ఆ దేశ క్రికెట్ బోర్డు ఛైర్మ‌న్ అతీఫ్ మషల్ సైతం భార‌త అభిమానుల ప్ర‌తిపాద‌న‌పై స్పందిస్తూ.. ‘‘రషీద్‌ ఖాన్ కోసం ఆఫర్ చేస్తున్నవారందరికీ థ్యాంక్స్. ప్రపంచ వ్యాప్తంగా అతడికెంత డిమాండ్ ఉందో నాకు తెలుసు. కానీ, అతడు ఎక్కడికీ వెళ్లడు. ఎందుకంటే.. అతడు అఫ్గానిస్తాన్ దేశస్థుడిగానే గర్వపడుతున్నాడు’’ అని ట్వీట్ చేశాడు. దీనిపై ర‌షీద్ మాట్లాడుతూ.. ‘‘క‌చ్చితంగా చైర్మన్. నేను అఫ్గానిస్తాన్ పౌరుడిగా గర్వపడుతున్నాను. నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను. నా దేశం కోసం పోరాడతాను. మేం శాంతిని వ్యాప్తి చేయాలనుకుంటున్నాం.. ఎందుకంటే అది మా దేశానికి చాలా అవసరం’’ అన్నాడు.


Tags:    

Similar News