నానో కారులో.. రతన్‌ జీ తుస్సీ గ్రేట్‌ హో

Update: 2022-05-19 11:30 GMT
సింప్లిసిటీ.. వినమ్రత.. విలువలు.. ప్రమాణాలు వీటన్నింటికి నిలువెత్తు నిదర్శనం రతన్‌టాటా. ఎంత గొప్పవాళ్లైనా ఆయన్ని చూస్తే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. దేశానికి కష్టం వచ్చిందంటే.. తన సంపదనంతా ఎడమచేత్తో సులువుగా దారబోయగలిగే ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఎనిమిది పదుల వయసులోనూ 20 ఏళ్ల యువకుడిలా కష్టపడుతూ.. ప్రతిరోజూ ఏదో కొత్త విషయం నేర్చుకోవాలనుకునే నిత్య విద్యార్థి. ఒక్క సైగతో తనకు కావాల్సింది క్షణాల్లో రప్పించుకోగలిగే సత్తా ఉన్నా.. మన పని మనమే చేసుకోవాలనే సూక్తిని నమ్మే వ్యక్తి రతన్‌ టాటా. సంపాదిస్తే ధనవంతులవుతారు కానీ.. ఎంతో మందికి ఎడమచేత్తో సాయం చేసి.. కుడికి చేయికి తెలియకూడదనుకునే ఐశ్వర్యవంతుడు రతన్‌టాటా.

ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాలనే మాటను అక్షరాలా పాటిస్తూ తన జీవితం ఎందరికో ఆదర్శంగా.. తన ప్రతి అడుగు మరెందరికో స్ఫూర్తిగా జీవిస్తున్న రతన్‌ టాటా గురించి ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు రతన్‌ టాటా నిజంగా మణిరత్నం అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఆయన సింప్లిసిటీకి మరోసారి ఫిదా అయి సోషల్ మీడియాలో రతన్‌జీ.. తుస్సీ గ్రేట్‌ హో అంటూ కమెంట్లు పెట్టేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే..

ముంబయిలో ఫైవ్ స్టార్ హోటల్ అనగానే గుర్తొచ్చేది తాజ్ హోటల్. గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గరలో ఉన్న ఈ హోటల్ టాటా గ్రూపు మేనేజ్‌మెంట్‌లోనే ఉంది. బడా వ్యాపారులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఫారెన్ టూరిస్టులతో ఈ హోటల్ ఎప్పుడూ సందడిగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే వారి కార్లతో ఈ హోటల్ గ్యారేజీ ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుంది. బెంజ్, ఆడీ, లాండ్రోవర్, రేంజ్‌రోవర్, ఫెరారీ, లాంబోర్గినీ.. ఇలా అన్నీ ఇంపోర్టెడ్ కార్లే ఈ గ్యారేజీలో ఎక్కువగా కనిపిస్తాయి. కనీసం రూ.50 లక్షలు విలువ చేయని కారు ఈ హోటల్ ఎంటర్ కాదు. అలాంటిది... మే 17న ఈ హోటల్‌లోకి కనీసం రూ.5 లక్షలు కూడా విలువ చేయని ఓ నానో కారు వచ్చింది.

ఐదు నక్షత్రాల హోటల్.. కళ్లు మిరుమిట్లు గొలిపే కార్లు ఉండే గ్యారేజీలోకి.. నానో కారు రావడం చూసి..  సిబ్బందితో సహా అక్కడున్నవారంతా షాకయ్యారు. ఆ బుజ్జి కారులో వచ్చిందెవరబ్బా అని వింతగా చూశారు. కారు తమ ముందు నుంచి వెళ్తోంటే.. కళ్లప్పగిచ్చి చూశారు. అందులో ఉన్న వ్యక్తి కనిపించేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. తమ కళ్లను తామే నమ్మలేక.. ఓ సారి కళ్లు తుడ్చుకుని మళ్లీ మళ్లీ చూశారు.

అప్పుడు అర్థమైంది వాళ్లకి వాళ్లు చూసింది నిజమే.. ఆ కారులో వచ్చింది సాక్షాత్తు రతన్‌టాటాయేనని. ఇంకేటి.. మనకు ఏది ఇంట్రెస్టింగ్‌గా అనిపించినా వెంటనే జేబులో చేయి పెట్టి ఫోన్ తీసి కెమెరాతో క్లిక్ క్లిక్‌మనిపించడమేగా. అంతే అక్కడున్న వారంతా.. వారి ఫోన్లలో రతన్‌టాటా ఫొటోలు వీడియోలు రికార్డ్ చేశారు. అంతటితో ఆగుతారా.. ఆయన సింప్లిసిటీ ప్రపంచమంతా మరోసారి తెలియజేయాలని.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

సాధారణంగా ఫన్నీ పోస్ట్‌లు, క్రేజీ ఫొటోలు, వీడియోలకే లక్షల్లో లైక్‌లు, షేర్‌లు వస్తాయి.. అలాంటిది రతన్‌ టాటా.. అందులోనూ నానో కారులో వెళ్తున్న వీడియో చూసి నెటిజన్లు తెగ లైకులు కొట్టారు. అంతటితో ఆగకుండా తమ స్నేహితులకు షేర్ చేశారు. ఇంకేటి సోషల్ మీడియా మొత్తం ఎక్కడ చూసినా రతన్‌టాటాయే..

తాను కావాలనుకుంటే.. తన కంపెనీ పరిధిలోనే ఉండే ల్యాండ్రోవర్, జాగ్వార్ వంటి లగ్జరీ కార్లలో రతన్ టాటా ప్రయాణించొచ్చు. కానీ ఆయన విలాసాలకు పోలేదు. అలా వెళ్తే ఆయన రతన్ టాటా కాలేరు. సామాన్య ప్రజల కోసం.. మిడిల్ క్లాస్ కుటుంబాల కోసం ఆయన సంస్థ రూపొందించిన నానో కారులోనే ప్రయాణించడం రతన్‌ టాటా సింప్లిసిటీకి నిలువెత్తు రూపమని చెప్పడానికి మరో ఉదాహరణ. లక్షల కోట్లు సంపాదిస్తున్నా.. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నా.. కనీసం ఆయన బాడీగార్డును కూడా పెట్టుకోరు. సామాన్యుడిలా ఎక్కడికి వెళ్లినా ఒంటరిగానే వెళ్తారు.

విలువలతో.. ప్రమాణాలతో.. ఎలాంటి వివాదాల జోలికి పోకుండా.. దేశ ప్రగతి చిత్రాన్ని మార్చిన రతన్‌ టాటా సింప్లిసిటీకి నెటిజన్లు మరోసారి ఫిదా అయ్యారు. లవ్‌యూటాటా, హ్యాట్సాఫ్ రతన్‌టాటా, యూఆర్‌యాన్‌ఇన్స్పిరేషన్‌ రతన్‌జీ, వీ రెస్పెక్ట్ యూ రతన్‌ జీ అంటూ హ్యాష్‌ టాగ్‌లతో సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.


Full View

Tags:    

Similar News