టాటా ల‌వ్ స్టోరీలో చైనానే విల‌న‌ట‌!

Update: 2020-02-13 17:30 GMT
ర‌త‌న్ టాటా....ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరు ప్ర‌ఖ్యాత‌లున్న భార‌తీయ పారిశ్రామిక దిగ్గ‌జం. టాటా గ్రూపును విజ‌య‌ప‌థంలో న‌డిపిస్తూ....ఎంద‌రికో మార్గ‌ద‌ర్శి అయిన బిజినెస్ టైకూన్. వేల కోట్ల ఆస్తి....ల‌క్ష‌లాది కార్మికులు....త‌రాలు కూర్చుని తిన్నా త‌ర‌గని సంప‌ద‌....ఇవ‌న్నీ ర‌త‌న్ టాటాకు సొంతం. వ్యాపారంతో పాటు సామాజిక సేవ‌లోనూ ముందుంటూ...పద్మ భూషణ్‌(2000) - పద్మ విభూషణ్‌(2008) వంటి అత్యున్న‌త పురస్కారాలు అందుకున్న నిగ‌ర్వి. ర‌త‌న్ టాటా ప్రొఫైల్ చూసిన వారంతా ....ఆయ‌న‌కేం అనుకునేవారే. అయితే, ఇదంతా నాణేనికి ఒక వైపే. చిన్న‌తనంలో త‌ల్లిదండ్రుల నిరాద‌ర‌ణ‌...తోటి విద్యార్థుల ఛీత్క‌రింపులు...ప్రియురాలిని వ‌దులుకోవ‌డం వంటి క‌ష్టాల‌ను ఎదుర్కొని రాటుదేలిన ర‌త‌న్ టాటా నాణేనికి మ‌రోవైపు. మ‌నంద‌రికీ ఉన్న‌ట్లే....ర‌త‌న్ టాటా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమ‌రీస్ ఉన్నాయ‌ట‌. ఓ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా త‌న బాల్యంలోని చేదు అనుభ‌వాలను...త‌న య‌వ్వ‌నంలోని మ‌ధురానుభూతుల‌ను ర‌త‌న్ టాటా మ‌న‌సువిప్పి చెప్పారు.

ర‌త‌న్ టాటా త‌ల్లిదండ్రులు నావల్‌ టాటా- సోనూ టాటా 1948లో విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్నారు. నావల్‌ టాటాకు రెండో భార్య సంతానం నోయల్‌ టాటా. అయితే, పదేళ్ల వయస్సులో త‌ల్లిదండ్రుల ప్రేమ‌కు దూర‌మైన టాటాను ఆయన బామ్మ చేరదీశారు. నాటి రోజుల్లో త‌న త‌ల్లిదండ్రుల విడాకుల కార‌ణంగా టాటాను ర్యాగింగ్ చేసేవార‌ట‌. ఆ స‌మ‌యంలో బామ్మ తోడుగా ఉండి సంయమనంతో ఉండటం నేర్పింద‌ట‌. ఇంజ‌నీర్ చ‌ద‌వ‌మ‌ని త‌న తండ్రి నిర్ణ‌యాన్ని టాటా వ్య‌తిరేకించార‌ట‌. ఆర్కిటెక్ట్ చ‌ద‌వాల‌న్న కోరిక‌ను బామ్మ బ‌ల‌ప‌రచడంతోనే ఆర్కిటెక్చర్‌ గ్రాడ్యుయేట్ అయ్యార‌ట‌.

లాస్‌ ఏంజెల్స్‌లోని ఓ నిర్మాణ సంస్థలో ప‌ని చేస్తున్న‌పుడు టాటా ప్రేమలో ప‌డ్డార‌ట‌. త‌న ప్రియురాలితో పెళ్లిపీట‌లు ఎక్క‌డ‌మే త‌రువాయి అన్న స‌మయంలో టాటా ఇండియా వెళ్లాల్సి వ‌చ్చింద‌ట‌. అవ‌సాన ద‌శ‌లో అనారోగ్యంతో ఉన్న త‌న బామ్మ‌కు స‌ప‌ర్య‌లు చేసేందుకు టాటా వ‌చ్చేశార‌ట‌. 1962లో ఇండో- చైనా వార్ నేప‌థ్యంలో త‌న ప్రియురాలిని ఇండియా పంపేందుకు ఆమె త‌ల్లిదండ్రులు నో అన్నార‌ట‌. దీంతో, త‌న ల‌వ్‌ కు బ్రేక‌ప్ చెప్పిన టాటా....త‌న‌ కోసం ఎన్నో త్యాగాలు చేసిన బామ్మ కోసం బ్ర‌హ్మ‌చారిగా ఉండిపోయార‌ట‌.



Tags:    

Similar News