అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రత్నాకర్

Update: 2019-08-25 16:55 GMT
ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విధాన నిర్ణయాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్నారనే చెప్పాలి. తాను తీసుకుంటున్న నిర్ణయాలపై ఎలాంటి ఊహాగానాలు అవకాశం ఇవ్వకుండానే వ్యవహరిస్తున్న జగన్... తాజాగా మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇటీవలే అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చిన జగన్... అమెరికాలో ఉండగానే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికాలో చాలా కాలం క్రితమే ఏపీ ప్రభుత్వం తన వ్యవహారాల కోసం ప్రత్యేక ప్రతినిధిని నియమించే సంప్రదాయానికి తెర తీసిన సంగతి తెలిసిందే కదా. ఈ పదవిని భర్తీ చేస్తూ జగన్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. అమెరికాలోని ప్రవాసాంధ్రుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న రత్నాకర్ పండుగాయలను అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించే విషయంలో జగన్ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం సాగుతోంది.

అమెరికా పర్యటనలో ఉండగానే... తనను కలిసిన రత్నాకర్ తో ఈ విషయాన్ని జగన్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే వెలువడే అవకాశాలున్నాయి. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు వెలువడిన తర్వాత అమెరికాకు వచ్చే ఏపీ ప్రభుత్వ అధికారులు - ప్రభుత్వ పెద్దల పర్యటనలతో పాటు ఏపీకి పెట్టుబడులను ఆకర్షించే విషయంలో రత్నాకర్ కీలక భూమిక పోషించనున్నారు. ఏపీకి సంబందించి దాదాపుగా అన్ని రంగాలకు సంబందించి అమెరికా నుంచి సహకారం అందేలా రత్నాకర్ కీలక భూమిక పోషించనున్నారు. మొత్తంగా అమెరికాలో ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వ్యవహారాలను కూడా ఆ దేశంలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రత్నాకర్ నడిపించనున్నారు.


Tags:    

Similar News