తనలోని బలహీనతను బయటపెట్టేసిన రత్నప్రభ!!

Update: 2021-03-29 05:30 GMT
తిరుపతి ఉప ఎన్నిక వేడి రాజుకుంటోంది. ఎన్నికల ప్రచారం జోరందుకుంటున్న వేళ.. బీజేపీ - జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె వెల్లడించిన అంశాలు ఆసక్తికరంగా మారాయి. కర్ణాటక క్యాడర్ అధికారిణిగా సుపరిచితురాలైన ఆమె.. తాను ఏపీకి సంబంధం ఉందన్న విషయాన్ని చెప్పుకునే ప్రయత్నం చేశారు.

ఆంధ్రప్రదేశ్ తన జన్మభూమి అని.. కర్ణాటక తన కర్మభూమిగా పేర్కొన్నారు. అందరిని కలుపుకొని తిరుపతి ఉప ఎన్నికలకు వెళుతున్నట్లు చెప్పారు. ఈరోజు (సోమవారం) తాను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. ఎంపీలుగా అధికార పార్టీకి చెందిన వారుఉండి ప్రయోజనం ఏముందన్న ఆమె.. తిరుపతి డెవలప్ మెంట్ కోసం తాను భాగస్వామిని అవుతానని చెప్పారు.

ప్రజలకు అభివృద్ధితో దగ్గర కావటం తన ఎజెండా అని చెప్పిన ఆమె.. అధికార పార్టీ ఎంపీలు పార్లమెంటులో ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. తానుఎంపీగా గెలిస్తే.. తిరుపతి సమస్యలపై గళం విప్పటానికి అవకాశం ఉందన్నారు. చిత్తూరు జిల్లాతో తనకున్నఅనుబంధాన్ని వెల్లడించారు. తిరుపతికి త్వరలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ వస్తారని.. ప్రచారం చేస్తారని స్పష్టం చేశారు.

ఇప్పటికే అందుకు తగ్గ రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా మంచి పని చేస్తే అభినందించటం తనకున్న బలహీనతగా చెప్పిన ఆమె.. అవసరం లేకున్నా ఎదుటివారి మీద బుదర జల్లటం తన వ్యక్తిత్వానికి సరిపోదన్నారు. నిజానికి వర్తమాన రాజకీయాల్లో బుదర జల్లటం.. అవసరం లేకున్నా ఆరోపణలు చేయటం లాంటి లక్షణాలు పుష్కలంగా ఉన్న వారే ప్రజల్లో పలుకుబడిని సంపాదిస్తున్నారు. అలాంటి తీరు అవసరం లేదంటున్న రత్నప్రభ.. తిరుపతి ఎన్నికల్లో ఏ మేరకు రాణిస్తారో చూడాలి.
Tags:    

Similar News