కాంగ్రెస్ త‌ర‌ఫున రేవంత్ ప్ర‌చారం!

Update: 2016-04-30 10:34 GMT
పాలేరు ఉపఎన్నిక నామినేషన్ల దాఖలు ప్రకియ ముగియడంతో ప్రచార ప‌ర్వం వేగం పుంజుకుంటోంది. ర‌స‌వ‌త్త‌రంగా మారిన ఈ ఉప ఎన్నిక‌లో ప్ర‌చారాన్ని హోరెత్తించేందుకు  కాంగ్రెస్ రెడీ అవుతోంది. ఈ క్ర‌మంలో ఆ పార్టీ త‌ర‌ఫున టీటీడీపీ అధ్య‌క్షుడు- ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు మ‌రికొంద‌రు కీల‌క నేత‌లు కూడా ప్ర‌చారానికి సిద్ధ‌మ‌య్యారు.

ఖమ్మం జిల్లా పాలేరు ఉపఎన్నికలో భాగంగా  సిట్టింగ్ సీటు దక్కించుకునేందుకు కాంగ్రెస్‌ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రచారానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేసిన‌ కాంగ్రెస్ పార్టీ అన్ని స‌మీక‌ర‌ణాలు పరిగణనలోకి తీసుకొని అధికార పార్టీకి పోటీగా గ్రామాలను చుట్టేసేందుకు సిద్ధమవుతోంది. కొత్తగా ఏర్పాటైన పీసీసీ కార్యవర్గానికి పాలేరు ప్రచార బాధ్యతలు కాంగ్రెస్ నాయకత్వం అప్పగించింది. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పీసీసీ ఇంచార్జీ ఉండేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఒక్కో గ్రామంలో ఇద్దరు, ముగ్గురు నేతలు ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. కిందిస్థాయి నుంచి ఓటరు నాడిని పసిగట్టేలా జాగ్రత్తలు తీసుకోంటోంది. ఏఐసీసీ నేతలను కూడా ప్రచారానికి రప్పించేలా కాంగ్రెస్ నాయకత్వం ప్లాన్  చేస్తోంది. ఏ నాయకులు  ఏ తేదీల్లో పర్యటించాలన్న వివరాలను ఇప్పటికే  ఢిల్లీకి పంపించింది. ఎన్నికల ఖర్చు బాధ్యతను కొందరు ముఖ్య నేతలకు అప్పగించినట్లు తెలుస్తోంది.

ఇక మిత్ర‌ప‌క్షాల‌ను స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డంలో భాగంగా కాంగ్రెస్ ప్రచారం పోస్టర్ లో కాంగ్రెస్ నేతల ఫోటోలతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు - పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ - పార్టీ మాజీ ఎంపీ నామానాగేశ్వర్ రావు - వైసీపీ అధినేత జగన్ - దివంగ‌త సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి - వైసీపీ ఎంపీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఫోటోలను ముద్రించారు. మ‌రోవైపు కాంగ్రెస్ అభ్యర్థి సుచరితా రెడ్డి తరపున టీడీఎల్పీ  నేత రేవంత్ రెడ్డి పాలేరులో మూడు రోజులు  చేయనున్నారు. వైసీపీ నుంచి పొంగులేటి శ్రీ నివాస్ రెడ్డి కూడా ప్ర‌చారంలో పాల్గొంటారని స‌మాచారం. మొత్తంగా మిత్రపక్షాలతో కలిసి ప్రచారాన్ని హోరెత్తించేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోందిమినేషన్లు ముగియడంతో పార్టీ నేతలను ఫీల్డ్ లోకి దించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రేవంత్ ప్రచారంతో మిత్ర‌ప‌క్షాల‌కు సానుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంద‌ని భావిస్తున్నారు.
Tags:    

Similar News