సుశీల్ @ ఖైదీ నెంబర్ 7579

Update: 2016-03-07 04:19 GMT
ఎవరి హద్దుల్లో వారుండాలి. పవర్ చేతిలో ఉంది కదా అని చెలరేగిపోతే చివరకు చిప్పకూడు తినాల్సి ఉంటుందన్న విషయం మరోసారి రుజువైంది. గతంలో మాదిరి.. తామేం చేసినా నడిచిపోతుందనే పరిస్థితి లేదన్న విషయం ప్రముఖల కుటుంబాల వాళ్లు గుర్తుంచుకోవటం మంచిది. అధికారం కవచంగా కంటే బాధ్యతగా భావిస్తే మరింత మంచిది. ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు సుశీల్ విషయాన్నే చూస్తే.. ఈ విషయం మరింత స్పష్టమవుతుంది.

తప్పతాగి(?) రోడ్డు మీద వెళుతున్న ఒక వివాహితను వేధించటం.. ఈ విషయం రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారటం.. దీనికి సంబంధించిన సీసీ కెమేరాల ఫుటేజ్ బయటకు రావటంతో రావెల కొడుకు ఫిక్స్ అయిన పరిస్థితి.తన కొడుకు మీద పెట్టినవన్నీ బెయిల్ బుల్ కేసులేనని.. తమకు చట్టం మీద నమ్మకం ఉందని.. ఏపీ విపక్ష నేత కారణంగానే తన కొడుకు మీద టార్గెట్ చేశారంటూ మంత్రి రావెల వాపోయినప్పటికీ.. ఆయన కొడుకు బెయిల్ విషయంలో మాత్రం చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది.

వేధింపులకు గురైన మహిళ.. మంత్రిగారి అబ్బాయిని గుర్తించటంతో సుశీల్ కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. శనివారం అర్థరాత్రి వేళ లొంగిపోయిన సుశీల్ ను అదివారం తుర్కయాంజాల్ నాంపల్లి మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తిరుపతయ్య ఇంట్లో సుశీల్.. అతని కారు డ్రైవర్ ను హాజరు పర్చారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి.. సుశీల్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసుల్ని ఆదేశించిన న్యాయమూర్తి కేసును 8కి వాయిదా వేశారు.

అనంతరం సుశీల్.. అతని డ్రైవర్ రమేష్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు. అక్కడ మంత్రి కుమారుడు సుశీల్ కు ఖైదీ నెంబర్ 7579 కేటాయించారు. రోడ్డు మీద వెళుతున్న ఒక వివాహితను వేధింపులకు గురి చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చిన మూడో రోజుకే మంత్రిగారి అబ్బాయి జైలుకు వెళ్లాల్సిన దుస్థితి. బరి తెగించినట్లుగా వ్యవహరించి.. రోడ్డు మీద వెళ్లే మహిళను వేధించిన సుశీల్.. ఆదివారం మేజిస్ట్రేట్ ఇంటి నుంచి బయటకు వస్తూ కంటతడి పెడుతూ వెళుతున్న సీన్ చూసిన పలువురు.. పవర్ ఉందని రెచ్చిపోతే.. చివరకు పరిస్థితి ఎక్కడివరకూ వెళుతుందనటానికి తాజా ఉదంతమే చక్కటి ఉదాహరణ అని వ్యాఖ్యలు చేసుకోవటం కనిపించింది.
Tags:    

Similar News