పార్ల‌మెంటులో సాంగేసుకున్న బ‌న్నీ విల‌న్‌

Update: 2019-07-02 08:01 GMT
రవి కిషన్ సింగ్ అంటే మన తెలుగు వాళ్ళు ఒక్కసారిగా గుర్తుపట్టారేమో గాని బన్నీ రేసుగుర్రం సినిమాలో విలన్‌ గా నటించిన మద్దాలి శివారెడ్డి అంటే ఠ‌క్కున గుర్తు పట్టేస్తారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శివారెడ్డి అనే పొలిటీషియన్ పాత్రలో విలన్‌గా నటించి మెప్పించిన రవి కిషన్ సింగ్ నిజజీవితంలో కూడా పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యారు. స్వతహాగా భోజ్‌ పురిలో టాప్ నటుడు అయిన రవి కిషన్ సింగ్ ఆ తర్వాత పలు దక్షిణాది భాషల్లో  నటించాడు. రేసుగుర్రం - కిక్ 2 లాంటి సినిమాల్లో విలన్ పాత్రలో తనదైన శైలిలో మెప్పించాడు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో రవికిషన్ యూపీలోని గోరఖ్‌ పూర్ లోక్‌ స‌భ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. విచిత్రమేమిటంటే ఈ నియోజకవర్గం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంచుకోట లాంటిది. ఇక ఎంపీగా గెలిచిన ఆదిత్య‌నాథ్ లోక్‌ సభలో తన తొలి ప్రసంగంతోనే ఆకట్టుకున్నారు. ఇండియాలో దాదాపు 25 కోట్ల మంది ప్రజలు మాట్లాడే భోజ్‌ పురి భాషను ఇంతవరకు రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో చేర్చ‌క పోవడంపై రవి కిషన్ తన ఆవేదన వ్యక్తం చేశారు.

మోడీ సైతం ఇటీవల తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో భోజ్‌ పురి భాష మాట్లాడారని... ఈ నేపథ్యంలోనే తాను తమ భాషకు రాజ్యాంగంలో ప్రాధాన్యత దక్కుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే ర‌వి కిష‌న్ సభలోనే భోజ్‌ పురి భాషలో ఓ పాట పాడి అందరినీ అలరించారు. ఏదేమైనా మాతృభాషపై ఉన్న మమకారంతో ఆ భాషకు మరింత ప్రాధాన్యత కల్పించే క్రమంలో  రవి కిషన్ సింగ్ చేసిన ఈ ప్రయత్నాన్ని భోజ్‌ పూరి భాషాభిమానులు ప్రశంసిస్తున్నారు.

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో కేవ‌లం 22 భాష‌లే ఉన్నాయి. మ‌రో 20 భాష‌ల‌ను కూడా ఆ షెడ్యూల్లో చేర్చి వాటిని కూడా భార‌తీయ భాష‌లుగా గుర్తించాల‌న్న డిమాండ్లు ఉన్నాయి. మ‌రి ఈ డిమాండ్లు ఎప్పుడు నెర‌వేర‌తాయో ?  చూడాలి.
Tags:    

Similar News