మీడియా వర్సెస్ మాఫియా.. రవి ప్రకాష్ తగ్గట్లేదసలు!

Update: 2019-06-05 12:53 GMT
తనపై నమోదు అయిన కేసుల విషయంలో విచారణకు హాజరు కాకుండా చాన్నాళ్ల పాటు తప్పించుకుని తిరిగాడు టీవీ నైన్ మాజీ సీఈవో రవి ప్రకాష్. మామూలుగా ఇలా ఎవరైనా పరార్ అయ్యారంటే వారు అజ్ఞాతంలో ఉన్నట్టు కింద లెక్క. గతంలో టీవీ నైన్ సీఈవోగా ఉన్నప్పుడు జర్నలిస్టుగా అలాంటి వారిని దొంగల్లా చూశాడు రవి ప్రకాష్. ఎవరి మీద అయినా కేసులు నమోదు అయితే వారే దోషులు అనేంత రేంజ్ లో ఈయన హడావుడి చేసేవాడు. అయితే తన మీద కేసులు నమోదు అయ్యాకా మాత్రం పరార్ అయ్యాడు.

అలా పరారీలో ఉండే ముందస్తు బెయిల్ ప్రయత్నాలు చేశాడు. అయితే అవేవీ వర్కవుట్ కాకపోవడంతో ఈయన చివరకు పోలీసుల ముందుకు వచ్చాడు. వరసగా రెండో రోజు  కూడా విచారణకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా రెండో రోజున రవి ప్రకాష్ మీడియా ముందు గట్టిగా మాట్లాడాడు. తన మాటల్లో వాడీవేడీ తగ్గనీయడం లేదసలు.

'మీడియా వర్సెస్ మాఫియా'గా యుద్ధం సాగుతోందని రవి ప్రకాష్ చెప్పుకొచ్చాడు. ఒక అవినీతిపరుడు అయిన వ్యాపారి తన మీడియా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకొంటూ ఉన్నాడని రవి ప్రకాష్ వాపోయాడు. తను - తన స్నేహితులు కలిసి పెట్టిన 'మోజో టీవీ' ని ఒక 'అమ్రిష్ పురి' కజ్జా చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాడని రవి ప్రకాష్ చెప్పుకొచ్చాడు.

తాము ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా - కష్టపడి దాన్ని డెవలప్ చేస్తే వేరే వ్యాపారి దాన్ని ఆక్రమించుకుంటున్నాడని రవి ప్రకాష్ చెప్పుకొచ్చాడు. పేదవాళ్ల భూములును డబ్బులు ఉన్నోళ్లు ఆక్రమించుకున్నట్టుగా.. మీడియాను మాఫియా వాళ్లు ఆక్రమించుకుంటున్నారని రవి ప్రకాష్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి పరారీ నుంచి వచ్చినా రవి ప్రకాష్ నీతులు మాత్రం అస్సలు  తగ్గడం లేదు!


Tags:    

Similar News