ఏపీనే ర‌విప్ర‌కాశ్ షెల్ట‌ర్ జోన్..?

Update: 2019-05-18 05:09 GMT
ఎలాంటి ర‌విప్ర‌కాశ్ ఎలా అయిపోయారు. ఆయ‌న వ‌స్తున్నారంటే మంత్రులు లేచి నిలుచునే ప‌రిస్థితి. ముఖ్య‌మంత్రులు సాద‌రంగా ఆహ్వానించే స్ట్రేచ‌ర్. అలాంటి ర‌విప్ర‌కాశ్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేయ‌ట‌మే కాదు.. ఎక్కడైనా అదుపులోకి తీసుకునేందుకు ప్ర‌య‌త్నాలు జోరుగా సాగుతున్నాయి. అయితే.. ర‌విప్ర‌కాశ్ ఎపిసోడ్ లో ఒక విష‌యాన్ని ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు.

ఇటీవ‌ల కాలంలో హైద‌రాబాద్‌ లో నేరం చేస్తున్న ప‌లువురు ప్ర‌ముఖులు.. త‌ల‌దాచుకోవ‌టానికి వీలుగా ఏపీని ఎంచుకోవ‌టం గ‌మాన‌ర్హం. ఎన్నిక‌ల ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన డేటా చౌర్యం కేసులోనూ నిందితుడు ఏపీని షెల్ట‌ర్ జోన్ కింద వాడేసుకున్న వైనాన్ని ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు.

తాజాగా టీవీ9 వ్య‌వ‌హారంలో కేంద్ర బిందువుగా మారిన ర‌విప్ర‌కాశ్‌.. క‌నిపించ‌కుండా పోవ‌టం ఒక ఎత్తు అయితే.. ఏపీ ఆయ‌న‌కు షెల్ట‌ర్ జోన్ గా మార‌టాన్ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. నేరం హైద‌రాబాద్ లో చేసి.. షెల్ట‌ర్ ఏపీలోనా? అంటున్న వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. మొన్న‌టికి మొన్న డేటా చౌర్యం కేసులో నిందితుడికి ఆశ్ర‌యం ఇచ్చిన ఏపీ.. తాజాగా ర‌విప్రకాశ్ అరెస్ట్ కాకుండా కాపాడుతున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

ర‌విప్ర‌కాశ్ లీల‌లు రోజుకొక‌టి చొప్పున బ‌య‌ట‌కు వ‌స్తున్నాయ‌ని.. కొత్త ఆరోప‌ణ‌లు వ‌స్తున్న కొద్దీ ఆయ‌న ఇమేజ్ మ‌రింత డ్యామేజ్ అవుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇలాంటి నేరారోప‌ణ‌లు ఉన్న వారికి ఆశ్ర‌యం క‌ల్పించే తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. విశ్వ‌సనీయ స‌మాచారం ప్ర‌కారం తాజాగా ర‌విప్ర‌కాశ్ ప్ర‌కాశం జిల్లాలోని ఒక రిసార్ట్ లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ స‌మాచారంపై సైబ‌రాబాద్ పోలీసులు క్రాస్ చెక్ చేయ‌టం షురూ చేశారు. ర‌విప్ర‌కాశ్ ను ఎలా అదుపులోకి తీసుకోవాల‌న్న అంశంపై ప్లాన్ చేస్తున్న‌ట్లుగా స‌మాచారం అందుతోంది.
Tags:    

Similar News