సైబ‌రాబాద్ పోలీసుల‌కు ర‌విప్రకాశ్ మొయిల్!

Update: 2019-05-16 07:18 GMT
అవును.. టీవీ9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్ రియాక్ట్ అయ్యారు. ఎక్క‌డికి వెళ్లారో.. ఎక్క‌డున్నారో? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ల‌భించని వేళ‌.. ఆయ‌న ఆచూకీ కోసం తెగ ట్రై చేస్తున్న సైబ‌రాబాద్ పోలీసుల‌కు ర‌విప్ర‌కాశ్ ఈమొయిల్ పంపిన‌ట్లుగా తెలుస్తోంది. మోసం.. ఫోర్జ‌రీ.. న‌మ్మ‌క‌ద్రోహం త‌దిత‌ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ.. పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ ఇప్ప‌టికే రెండుసార్లు నోటీసులు ఇచ్చిన సైబ‌రాబాద్ పోలీసుల‌కు ర‌విప్ర‌కాశ్ తాజాగా మొయిల్ రూపంలో స‌మాధానం ఇచ్చిన‌ట్లుగా స‌మాచారం.

త‌న‌పై న‌మోదైన కేసుల్లో విచార‌ణ‌కు త‌న‌కు మ‌రో ప‌ది రోజుల స‌మ‌యం ఇవ్వాల‌ని కోరిన‌ట్లుగా చెబుతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ర‌విప్ర‌కాశ్ కు సన్నిహితుడు..టీవీ9 షేర్ల విష‌యంలో వివాదంలో ఉన్న న‌టుడు శివాజీ సైతం మొయిల్ రూపంలో సైబ‌రాబాద్ పోలీసుల‌కు స‌మాధానం ఇవ్వ‌టం గ‌మ‌నార్హం.

ఆయ‌న కూడా విచార‌ణ‌కు మిన‌హాయింపు ఇవ్వాల‌ని.. మ‌రికొంత టైం కావాల‌ని కోరిన‌ట్లుగా తెలుస్తోంది. తాజా ప‌రిణామాలు చూస్తుంటే.. త‌మ‌పై న‌మోదైన కేసుల విచార‌ణ‌ను వీలైనంత ఆల‌స్యం చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. నిన్న‌టికి నిన్న హైకోర్టును ఆశ్ర‌యించిన ర‌విప్ర‌కాశ్ కు ఎదురుదెబ్బ త‌గ‌ల‌టం.. ఆయ‌న పిటిష‌న్ ను అత్య‌వ‌స‌రంగా విచారించే అవ‌కాశం లేద‌ని చెప్ప‌టం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఈ మొయిల్ రూపంలో సైబ‌రాబాద్ పోలీసుల‌కు స‌మాధానం ఇస్తార‌న్న స‌మాచారం ఆస‌క్తిక‌రంగా మారింది. సాధార‌ణంగా పోలీసులు ఇచ్చిన టైంకు వారి ఎదుట హాజ‌రు కావ‌ట‌మో.. లేదంటే కోర్టు నుంచి మిన‌హాయింపు పొంద‌టం చేస్తుంటారు. అందుకు భిన్నంగా పోలీసుల‌కు తాము ఎన్ని రోజులు రాలేమో అన్న విష‌యాన్ని తామే డిసైడ్ చేసి.. పోలీసుల‌ను రిక్వెస్ట్ చేస్తున్న తీరు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.



Tags:    

Similar News