చెప్పుతో కొట్టిన ఎంపీ కొత్త డిమాండ్

Update: 2017-05-07 07:09 GMT
తనకు బిజినెస్ క్లాస్ కేటాయించనందుకు ఎయిరిండియా సీనియర్ ఉద్యోగిపై చెప్పుతో దాడి చేసి విమానయాన సంస్థల ఆగ్రహానికి గురైన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ గుర్తున్నాడు క‌దా! త‌న వివాదాస్ప‌ద ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగా తెర‌మీద‌కు వ‌చ్చిన గైక్వాడ్ ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌క‌ట‌న చేశాడు.  విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులపై అమర్యాదగా-అసభ్యంగా ప్రవర్తించే ప్రయాణికులపై నిషేధం విధించేలా విమానయాన శాఖ కొత్త నిబంధనలు తేవడంపై స్పందించిన గైక్వాడ్ ఎయిరిండియా అంటే త‌న‌కున్న కోపాన్ని ఈ సంద‌ర్భంగా చాటుకున్నాడు.

నూత‌న నిబంధ‌న‌ల‌ను తాను స్వాగతిస్తున్నాన‌ని చెప్పిన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిర్‌ లైన్స్ సిబ్బంది కూడా నిబంధనలు విధించాలని డిమాండ్ చేశారు. ప్రయాణికుల పట్ల ఎయిరిండియా సిబ్బంది దారుణంగా వ్యవహరించిన ఘటనలు తనకు ఎన్నో తెలుసని గుర్తు చేశారు. ఎయిరిండియా సిబ్బందికి ప్రయాణికులతో ఎలా నడుచుకోవాలో తెలియదని గైక్వాడ్ వ్యాఖ్యానించారు.  ప్ర‌యాణికుల కోసం నిబంధనలు తీసుకొచ్చినప్పుడు ఎయిరిండియా సిబ్బందికి కూడా కఠినమైన నిబంధనలు పెట్టాలి అని డిమాండ్ చేశారు. అప్పుడే ఇరు వ‌ర్గాలు త‌మ త‌ప్పుడు ప్ర‌వ‌ర్త‌న‌కు బాధ్య‌త వ‌హించిన‌ట్లు అవుతుంద‌ని గైక్వాడ్ పేర్కొన్నారు. ఎయిరిండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టిన గైక్వాడ్‌ను విమానాయన సంస్థలు విమానప్రయాణాన్ని నిషేధించగా, తర్వాత క్షమాపణలు చెప్పడంతో తిరిగి విమానప్రయాణం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గైక్వాడ్ చేసిన డిమాండ్‌ పై ఎయిర్ ఇండియా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మ‌రి!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News