జైల్లో తొలిరోజు రవిప్రకాశ్ కు అలా గడిచిందట

Update: 2019-10-06 06:19 GMT
అక్రమంగా నిధుల మళ్లింపు అంశంపై ఇచ్చిన ఫిర్యాదుపై యుద్ధ ప్రాతిపదికన కదిలిన పోలీసులు. కంప్లైంట్ ఇచ్చిన 12 గంటల్లోనే టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ను అదుపులోకి తీసుకోవటం. సుదీర్ఘంగా విచారించి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయటం. ఆపై అరెస్ట్ చేయటం తెలిసిందే.

గతంలో కేసులు నమోదు చేసిన తర్వాత. ఆయన్ను విచారణకు హాజరయ్యేలా చేయటం కోసమే సైబరాబాద్ పోలీసులు నానా పాట్లు పడితే.. అందుకు భిన్నంగా తాజా ఉదంతంలో మాత్రం అలా కంప్లైంట్ ఇవ్వటం. ఇలా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయటం వెనువెంటనే జరిగిపోవటం తెలిసిందే.

శుక్రవారం సాయంత్రం ఆరు గంటల వేళలో కంప్లైంట్ ఇస్తే.. శనివారం ఉదయం పది గంటల వేళకే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి విచారణను షురూ చేయటం జరిగింది. సాయంత్రానికి అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించి.. .ఆ వెంటనే గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి.. న్యాయమూర్తి ఇంటికి తీసుకెళ్లారు. కంప్లైంట్ కాపీలో ఉన్న కంటెంట్ కు సంబంధించి ఐపీసీ సెక్షన్ కింద పెట్టిన వాటి కారణంగా.. ఆయనకు బెయిల్ ఇచ్చే అవకాశం లేకపోగా. 14 రోజులు రిమాండ్ లో ఉండాల్సి వచ్చింది.

దీంతో. చంచల్ గూడ జైల్లో సాధారణ ఖైదీలా సింగిల్ బ్యారక్ లో ఉంచినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ తొలిరోజు జైలు జీవితం మిగిలిన ప్రముఖల మాదిరే గడిచిందని చెబుతున్నారు. అండర్ ట్రయల్ ఖైదీగా నంబరు 4412 నుకేటాయించి. కృష్ణా బ్యారక్ లో ఉంచారు.

రాత్రంతా ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉన్న ఆయన.. రాత్రంతా ఎక్కువసేపు నిద్ర పోలేదని చెబుతున్నారు. ఆదివారం ఉదయం టిఫిన్ కింద ఉప్మా. కిచిడీ ఇస్తే కాస్తంత తిని మిగిలింది వదిలేసినట్లుగా చెబుతున్నారు. ఆయన బెయిల్ పిటిషన్ పై ఈనెల 9న వాదనలు జరగనున్నాయి. అక్రమ పద్దతిలో చట్టవిరుద్ధంగా రూ.18 కోట్ల మొత్తాన్ని సొంతానికి వాడుకున్నట్లుగా టీవీ9 తాజా సీఈవో సింగారావు ఇచ్చిన కంప్లైంట్ తో. రవిప్రకాశ్ ను జైల్లో పెట్టారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News