‘కారు’లో రాజ్యసభకు వెళ్లనున్న రావుల?

Update: 2016-03-21 06:50 GMT
తెలంగాణలో మరో టీడీపీ నేత కారెక్కేందుకు రెడీ అవుతున్నారట. అయితే... అందుకు ఆయన తన కోరికల చిట్టా విప్పి దానికి ఓకే చేస్తేనే వస్తానని బేరమాడుతున్నారట. మహబూబ్‌ నగర్ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌ రెడ్డి టీఆరెస్ అధినేత కేసీఆర్‌ కు తన వైఖరిని స్సష్టంగా చెప్పినట్లు సమాచారం.

వివాదరహితుడు - సౌమ్యుడు అయిన రావుల టీడీపీలో కీలకనేతగా ఉండేవారు. మంచి తెలివైన నేత అయిన ఆయన చంద్రబాబునాయుడు అత్యంత విలువైన సలహాలు - సూచనలు ఇచ్చే రాజకీయ మేధావుల్లో ఒకరు. 2004 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఆ తరువాత 2004లో వనపర్తి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో అక్కడి నుంచి గెలిచినా 2014 సాధారణ ఎన్నికల్లో తిరిగి ఓటమిని చవిచూశారు. సాధారణ ఎన్నికల్లో తర్వా త తెలంగాణలో టీడీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారడంతో ఆ పార్టీలో వుండి లాభం లేదనే ఉద్దేశంతో ఆయన కారెక్కేందుకు డిసైడయ్యారని సమాచారం.

మరోవైపు చంద్రబాబుపై ఎంతో నమ్మకం ఉన్న రావులకు కొద్దికాలంగా చంద్రబాబుపై నమ్మకం పోయిందట. పార్టీ తెలంగాణలో దారుణంగా దెబ్బతింటున్నా.... నాయకులు వెళ్లిపోతున్నా ఆయన నష్టనివారణ చర్యలు చేపట్టకపోవడంతో చంద్రబాబు ఇక తెలంగాణపై దృష్టి పెట్టేలా లేదని రావుల భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఇక టీడీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదన్న ఉద్దేశంతో కారెక్కెందుకు ఆసక్తి చూపుతున్నారట.

తాను అన్ని పదవులు అనుభవించానని... తెలంగాణలో ఎమ్మెల్సీ - మంత్రి పదవి వంటివాటిపై తనకు ఆసక్తి లేదని,  రాజ్యసభ ఇస్తే టీఆరెస్ లోకి వస్తానని కేసీఆర్ కు ఆయన స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.  రావుల పట్ల సీఎం కేసీఆర్‌ తో పాటు పార్టీలో ముఖ్యనేతగా వున్న హరీష్‌ రావుకు కూడా మంచి అభిప్రాయమే వుంది. దీంతో మామ అల్లుళ్లు ఇద్దరూ ఏదో ఒక మంచి పదవి ఇస్తామనే హామితో రావులను పార్టీ లోకి తీసుకురావాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక ఇటీవలే గులాబీ గూటికి చే రిన టీటీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎర్రబెల్లి దయాకర్‌ రావు కూడా రావులకు మంచి సహచరుడు. ఈ కారణంతో ఎర్రబెల్లి కూడా రావులను పార్టీలోకి తీసుకువచ్చేందుకు తన వంతు ప్రయత్నాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News