ఆ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీడీపీ వైపు చూస్తున్నారా?

Update: 2022-08-08 08:32 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాయ‌చోటి జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి ఈసారి టీడీపీ వైపు చూస్తున్నారా అంటే అవున‌నే గాసిప్స్ వినిపిస్తున్నాయి. మేడా 2014లో టీడీపీ నుంచి రాజంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే గ‌త ఎన్నిక‌ల ముందు వైఎస్సార్సీపీలో చేరి మ‌రోమారు విజ‌యం సాధించారు. ఇప్పుడు మ‌ళ్లీ తీర్థం పుచ్చుకోనున్నార‌నే గాసిప్స్ నేప‌థ్యంలో రాజంపేట రాజ‌కీయాలు వేడెక్కియి.

వాస్త‌వానికి రాజంపేట‌లో బ‌లిజల జ‌నాభా ఎక్కువ‌. గ‌తంలో వివిధ పార్టీల త‌ర‌ఫున బ‌లిజలే అత్య‌ధిక సార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. గ‌త ఎన్నిక‌ల్లో మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి త‌మ‌కు షాక్ ఇవ్వ‌డంతో టీడీపీ బ‌లిజ సామాజిక‌వ‌ర్గం నుంచి బ‌త్యాల చెంగ‌ల్రాయుడుకి సీటు ఇచ్చింది. అయితే ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు.

కాగా ఇటీవ‌ల కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్ర‌తి పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. దీని ప్ర‌కారం పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గంగా ఉన్న రాజంపేట జిల్లా అవ్వాల్సి ఉంది. అయితే జ‌గ‌న్ ప్ర‌భుత్వం రాజంపేట‌ను కాద‌ని రాయ‌చోటిని జిల్లా కేంద్రంగా చేసింది. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాల‌ని పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు, ఉద్య‌మాలు నిర్వ‌హించినా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు. స్వ‌యంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున‌రెడ్డితోపాటు ఆ పార్టీ నేత‌లు కూడా రాజంపేటను జిల్లా చేయాల‌ని కోరిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం ఖాత‌రు చేయ‌లేదు.

దీంతో అప్ప‌టి నుంచి మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి అసంతృప్తిగా ఉన్నార‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి జిల్లా ఏర్పాటుకు ఆందోళ‌న‌లు చేసిన‌ప్పుడే ఆయ‌న ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఎమ్మెల్యే ప‌ద‌వికి, వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే రాజీనామా చేయ‌కుండా గుంభ‌నంగా ఉంటున్నారని అంటున్నారు. ఆయ‌న టీడీపీలో మ‌రోమారు చేర‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని చెబుతున్నారు.

అయితే ఈసారి టీడీపీ జంపింగ్ జ‌పాంగుల‌కు చోటు ఇవ్వ‌దని అంటున్నారు. మ‌రోసారి బ‌లిజ సామాజిక‌వ‌ర్గానికే చోటు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. లేదా టీడీపీ, జ‌న‌సేన పొత్తులో పోటీ చేసినా ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని జ‌న‌సేన‌కు కేటాయించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. రాజంపేట‌లో బ‌లిజ‌ల జనాభా ఎక్కువ‌. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ జ‌న‌సేన పార్టీ ప‌ట్ల కూడా ఆద‌ర‌ణ క‌నిపిస్తోంద‌ని పేర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో పొత్తు ఉంటే జ‌న‌సేన‌కు కేటాయిస్తార‌ని లేదంటే టీడీపీ పోటీ చేస్తుంద‌ని స‌మాచారం. అయితే ఎవ‌రు పోటీ చేసినా బ‌లిజ‌ల‌కే సీటు ఇస్తార‌ని తెలుస్తోంది.

ఇక వైఎస్సార్సీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే, ప్ర‌స్తుతం ఆర్టీసీ చైర్మ‌న్ ఆకేపాటి అమ‌ర్నాథ్ రెడ్డి పోటీ చేస్తార‌ని చెబుతున్నారు. లేదంటే మ‌రెవ‌రైనా కొత్త అభ్య‌ర్థిని రంగంలోకి దించుతార‌ని, మ‌హిళ‌కు చాన్స్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.
Tags:    

Similar News