పోల‌వ‌రం గుట్టు... రాయ‌పాటి విప్పారే!

Update: 2017-10-31 05:01 GMT
ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న పోల‌వ‌రం ప్రాజెక్టును ఎట్టి ప‌రిస్థితిలోనూ వ‌చ్చే ఎన్నిక‌ల్లోపే పూర్తి చేయాల‌ని భావిస్తున్నారు. అయితే, అనూహ్య రీతిలో ఇది తీవ్ర ఆల‌స్యం అయిపోతోంది. దీనికి కార‌ణాలు ఇప్ప‌టి వ‌ర‌కు అంత‌ప‌ట్ట‌లేద‌నేది అటు బాబు, ఇటు ఆయ‌నను స‌మ‌ర్ధించే ప‌త్రిక‌లు, -మీడియా మాట‌!! అయితే, ఈ లేటు విష‌యంలో బాబుదే బాధ్య‌త‌ని బ‌య‌ట పెట్టారు ఎంపీ రాయ‌పాటి. వాస్త‌వానికి ఈ ప్రాజెక్టును విభ‌జ‌న చ‌ట్టంలో చేర్చారు. దీంతో దీని నిర్మాణం మొత్తం కేంద్రంమే చూసుకుంటుంది. అంతేకాకుండా అయ్యే పూర్తి వ్య‌యాన్ని 100% కూడా కేంద్ర‌మే భ‌రిస్తుంది. అయినా కూడా చంద్ర‌బాబు దీనిని తానే స్వ‌యంగా ప‌రిశీలించి ప‌ర్య‌వేక్షిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అంతేకాదు, ప్ర‌తి సోమ‌వారాన్నీ ఆయ‌న పోల‌వారంగా మార్చేశారు. ప్ర‌తి పోల‌వారం నాడు బాబు ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ.. ప్రాజెక్టుపై దృష్టి పెడుతున్నారు. ప్రాజెక్టు ప‌నులు ఎంత వ‌ర‌కు వ‌చ్చాయి. ఎంత మంది కార్మికులు ప‌నులు చేస్తున్నారు. ఎన్ని యంత్రాలు ఉన్నాయి? వ‌ంటి క్షేత్ర‌స్థాయిలో ప‌నులను సైతం ఆయ‌న ప‌ర్య‌వేక్షిస్తున్నారు. పూర్తి బాధ్య‌త‌లను జ‌ల‌వ‌న‌రుల మంత్రి దేవినేని ఉమాకి అప్ప‌గించారు. అధికారుల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఏ ప‌నులూ ఆగ‌డానికి వీల్లేద‌ని, అనుకున్న స‌మ‌యానికి అనుకున్న‌ట్టు ప‌నులు జ‌రిగిపోవాల‌ని 2018 నాటికి పోల‌వ‌రంలో నీళ్లు ప‌ర‌వ‌ళ్లు తొక్కాల‌ని బాబు ఆకాంక్షిస్తున్నారు.

అయినా కూడా ఎందుకో ప‌నులు జ‌ర‌గ‌డం లేదు. దీంతో ఈ జాప్యానికి బాధ్య‌త‌గా ప్ర‌ధాన కాంట్రాక్ట్ సంస్థ అయిన ట్రాన్స్ ట్రాయ్ సంస్థ‌ను మార్చ‌డ‌మా?  లేక ధ‌ర‌లు పెంచ‌డ‌మా? అనేదానిపైనా బాబు చ‌ర్చ చేశారు. అయితే, ఈ రెండింటికీ కేంద్రం నుంచి సానుకూల ఆన్స‌ర్ రాలేదు. అయితే, అస‌లు పోల‌వ‌రం ఆల‌స్యం కావ‌డానికి వెనుక ఉన్న మ‌ర్మం ఏమిట‌నే ప్ర‌శ్న‌పై తాజాగా పోల‌వ‌రం ప్రాజెక్టు కాంట్రాక్టు పొందిన టీడీపీ నేత‌ - ఎంపీ - రాయ‌పాటి సాంబ‌శివ‌రావు సోమ‌వారం స్పందించారు. దీనిపై చంద్ర‌బాబు సోమ‌వారం స‌మీక్ష నిర్వ‌హించిన అనంత‌రం గుంటూరులో మాట్లాడిన రాయ‌పాటి.. పోల‌వ‌రం ఆల‌స్యంపై పెద‌వి విప్పారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలన్నదే సీఎం చంద్రబాబునాయుడి లక్ష్యమని అన్నారు.

ఈ ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకే ట్రాన్స్ ట్రాయ్ నుంచి పనులు సర్దుబాటు చేశారని చెప్పారు.  ట్రాన్స్ ట్రాయ్ కు భూములను ఆలస్యంగా అప్పగించారని - అందువల్లే పనుల్లో జాప్యం జరిగిందని అన్నారు. ‘పోలవరం’ ను వేగంగా పూర్తి చేసేందుకే పనులను మిగతా కంపెనీలకు సర్దుబాటు చేశారని, నిర్ణీత గడువులోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని రాయపాటి చెప్పారు. దీంతో పోల‌వ‌రం ప‌నుల జాప్యం కాంట్రాక్టు సంస్థ‌ది కాద‌ని రాయ‌పాటి చెప్ప‌క‌నే చెప్పారు. మ‌రి బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


Tags:    

Similar News