షాకింగ్ విష‌యాలు చెప్పిన నాటి రేమాండ్ రారాజు

Update: 2017-08-15 04:25 GMT
న‌మ్మి కొడుక్కి ఆస్తి మొత్తం రాసిస్తే.. త‌న‌ను చివ‌ర‌కు రోడ్డు మీద నిల‌బెట్టాడంటూ కోర్టుకు ఎక్కిన ప్ర‌ఖ్యాత పారిశ్రామిక‌వేత్త‌.. రేమాండ్ వ్య‌వ‌స్థాప‌కులు విజ‌య్ ప‌థ్ సింఘానియా ఇష్యూ కొద్ది రోజుల క్రిత‌మే బ‌య‌ట‌కు వ‌చ్చింది. వేలాది కోట్ల ఆస్తికి య‌జ‌మాని అయి ఉండి.. కొడుకును న‌మ్మిన పాపానికి ప్ర‌స్తుతం తీవ్ర‌మైన ఆర్థిక ఇబ్బందుల్లో.. చిన్న అద్దె ఇంట్లో కాలం వెళ్ల‌దీస్తున్న ఆయ‌న త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై కొడుకు మీద న్యాయ‌పోరాటం చేస్తున్న వైనం బ‌య‌ట‌కు వ‌చ్చి పారిశ్రామిక‌వ‌ర్గాలు మొదలుకొని సామాన్యుల వ‌ర‌కూ అంద‌రి మ‌ధ్య హాట్ టాపిక్ గా మారింది.

కొడుకు త‌న‌కు చేసిన మోసంపై తాజాగా ఒక మీడియా  సంస్థ తో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చెప్పిన విష‌యాలు సంచ‌ల‌నంగా ఉండ‌ట‌మే కాదు.. పిల్ల‌ల‌కు ఆస్తి విష‌యంలో మాత్రం ఎవ‌రూ తాను చేసినంత ఘోర‌మైన త‌ప్పును చేయొద్దంటూ చెప్పిన మాట‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తున్నాయి. ఇంత‌కీ. నాటి రేమాండ్ రారాజు ఏం చెప్పారన్న‌ది ఆయ‌న మాట‌ల్లోనే వింటే..

గౌత‌మ్ (విజ‌య్ ప‌థ్ సింఘానియా కుమారుడు) వ‌చ్చి తిరుప‌తి బాలాజీ మీద ప్ర‌మాణం చేసి నేను చెబుతున్న‌వ‌న్నీ అబ‌ద్ధాల‌ని నిరూపిస్తే.. మ‌రుక్ష‌ణ‌మే కేసును వెన‌క్కి తీసుకుంటా. తిరుప‌తి బాలాజీ మీద ప్ర‌గాఢ విశ్వాసం ఉంద‌ని. బాలాజీ మీద భ‌క్తి చాలా ఎక్కువ‌. విశ్రాంతి తీసుకోండి.. ఇంకా ఎంత‌కాలం శ్ర‌మ‌ప‌డ‌తారంటూ గౌత‌మ్ ప్ర‌తిసారీ అనేవాడు. దీంతో అత‌న్ని న‌మ్మా. అత‌ని సామ‌ర్థ్యం ఏమిటో చూద్దామ‌ని నా వాటాలోని షేర్ల‌న్నీ గౌత‌మ్‌ కి ఇచ్చేశా. గౌత‌మ్ చ‌ర్య‌ల్ని గ‌మ‌నిస్తే..  సంస్థ‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తాడ‌ని న‌మ్మేవాడిని. మ‌న‌సు మాత్రం అత‌ను చేయ‌లేడ‌ని చెబుతుండేది.

ఇంటి విష‌యాలు మీడియాకు చెప్ప‌టం ఏమిటంటూ గౌత‌మ్ అంటున్నాడు. అత‌నికి అహంకారం ఎక్కువ‌. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌టానికి మీడియా అవ‌స‌రం లేదు. కోర్టులో ఉన్న వ్య‌వ‌హారాల్ని మీడియాతో మాట్లాడ‌ను. నా హ‌క్కుల్ని కాపాడుకునేందుకు పోరాడ‌తా. రేమాండ్ పూర్తి హ‌క్కుల్ని గౌత‌మ్‌కు ఇవ్వ‌టం నేను చేసిన పెద్ద త‌ప్పు. అత‌ని క్యారెక్ట‌ర్ బ‌య‌ట‌పెట్టింది.

అధికారం ఒక‌రి క్యారెక్ట‌ర్ ను ఎప్పుడూ మార్చ‌దు. కేవ‌టం బ‌య‌ట‌పెడుతుంది మాత్ర‌మే. నిజ స్వ‌రూపాన్ని దాచి పెట్టి అధికారం.. డ‌బ్బు పొందొచ్చు. ఆ టైంలో ఏమైనా చేయ‌గ‌ల‌రు. దేనినైనా కొన‌గ‌ల‌న‌న్న దుర‌హంకారం బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఒక బ‌ల‌హీన క్ష‌ణంలో గౌత‌మ్‌కి ఆస్తుల‌న్నీ రాసిచ్చాను. మ‌న కుటుంబాన్ని స‌హ‌జంగా ప్రేమిస్తుంటాం. అదే బ‌ల‌హీన‌త అవుతుంది. అలాంటి బ‌ల‌హీన‌త‌తోనే స‌ర్వ‌స్వం ఇచ్చేశా. ద‌య‌చేసి అంద‌రికి నేను చెప్పేది ఒక్క‌టే. మీరు బ‌తికి ఉండ‌గా.. మీ పిల్ల‌ల‌కు ఆస్తులు రాసివ్వ‌కండి. ప‌దిమంది పిల్ల‌లు ఉంటే వారిలో ఒక్క‌రైనా మంచివారు ఉంటారు. లేదంటే క‌నీసం ఆరుగురైనా స్వార్థం కోసం త‌ల్లిదండ్రుల బాగును కోరుకునేవారు ఉంటారు. కానీ.. అంద‌రూ ఒకేలా ఉండ‌రు.

త‌ల్లిదండ్రులు చేసి మేలును మ‌రిచి.. త‌మ నిజ‌స్వ‌రూపాన్ని బ‌య‌ట‌పెట్టుకునే ద‌రిద్ర‌పు బుద్ధి ఉన్న వారు ప్ర‌తి చోటా ఉంటారు. వారిని మీరు గుర్తించండి. రేమండ్ త‌న స్వార్జితంగా గౌత‌మ్ ఫీల‌వుతున్నాడు. సొంత ఖ‌ర్చుల‌కు కూడా కంపెనీ సొమ్ము వాడుతున్నాడు. గౌత‌మ్ చ‌ర్య‌ల్ని బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర్స్ అయినా నియంత్రిస్తార‌ని విశ్వ‌సిస్తున్నా.

నాటి రేమండ్ రారాజు చెబుతున్న వ్యాఖ్య‌ల‌పై గౌత‌మ్ రియాక్ట్ అయ్యారు.  మ‌ధ్య‌వ‌ర్తి ద్వారా త‌మ మ‌ధ్య‌నున్న స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌టానికి సిద్ధ‌మ‌ని చెబుతున్నారు. దీనికి విజ‌య్ సింఘానియా వాద‌న వేరేలా ఉంది. ఏదైనా లాయ‌ర్ ద్వారా.. కోర్టు ఆదేశాల ప్ర‌కార‌మే త‌న నిర్ణ‌యం ఉంటుంద‌ని తేల్చి చెబుతున్నారు. ఈ ఇష్యూ బ‌య‌ట‌కు రావ‌టంతో రెండు రోజులుగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంతా షాక్ లో ఉన్న‌ట్లుగా గౌత‌మ్ చెబుతున్నాడు. త‌న తండ్రిని ఎవ‌రో మిస్ లీడ్ చేస్తున్నారంటూ వాపోతున్నారు. ఆర్థిక ప్ర‌యోజ‌నాల కోస‌మే త‌న తండ్రి పంచ‌న చేరిన కొంద‌రు ఇలాంటి వివాదాన్ని సృష్టించారంటున్నారు. సినిమాటిక్ గా ఉన్న ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు దేశంలో అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది.
Tags:    

Similar News