0.5శాతం తగ్గితే ఈఎంఐ తగ్గేదెంత?

Update: 2015-09-30 05:01 GMT
రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రెపో రేట్ ను 0.5శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటం 24 గంటల క్రితం వార్త. ఇప్పుడు అందరి దృష్టి.. గవర్నర్ ప్రకటించిన తాయిలం వ్యక్తిగతంగా ఎంత లాభం చేకూరుతుందన్నదే కొత్త లెక్క. వ్యక్తిగతంగా తీసుకునే గృహ రుణాలపై ఈ రెపోరేటు తగ్గింపు ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

అయితే.. ఈ ప్రయోజనం ఎంత ఉంటుందన్నది లెక్క వేస్తే.. ఆనందం కలగటం ఖాయం. అదెలానంటే.. ఒక ఇల్లు కొన్న వ్యక్తి బ్యాంకు నుంచి రూ.25లక్షలు రుణం తీసుకున్నారనుకుందాం. 10 శాతం వడ్డీ మీద 20 ఏళ్ల కాల పరిమితి మీద.. నెలసరి ఈఎంఐలు చెల్లించే ఒప్పందం మీద రుణం తీసుకుంటే.. తాజాగా రిజర్వ్ బ్యాంకు గవర్నర్ తగ్గించిన 0.5 శాతం రెపోరేట్ కారణంగా 18 సంవత్సరాల 2 నెలల్లోనూ రుణం తీరిపోతుంది. అంటే.. రిజర్వ్ బ్యాంకు గవర్నర్ తన నిర్ణయాన్ని వెల్లడించక ముందు ఎంత మొత్తం అయితే ఈఎంఐ కింద కడుతున్నామో.. దాన్నే కొనసాగిస్తే.. 20 ఏళ్ల కాలం కాస్త.. 18 ఏళ్ల 2 నెలలకు తగ్గుతుంది. అంటే.. 0.5శాతం తగ్గింపునకు 20 ఏళ్ల వ్యవధిలో కలిగే ప్రయోజనం ఒక ఏడాది పది నెలలు (22 నెలలు) అన్న మాట. అంటే.. ఇప్పుడు కడుతున్న ఈఎంఐ మొత్తం 22 నెలలు కట్టనక్కర్లేదన్న మాట.

ఇక.. రూపాయిల్లో ప్రయోజనం చూస్తే.. పైన చెప్పినట్లే రూ.25లక్షల రుణ మొత్తం తీసుకుంటే.. 20 ఏళ్లకు రుణపరిమిత కాలానికి ప్రతి నెలా కట్టాల్సిన ఈఎంఐ రూ.24,125 వరకూ ఉంటుంది. తాజాగా తగ్గించిన రెపోరేటు కారణంగా రూ.23,303కు తగ్గుతుంది. అంటే.. ఆర్ బీఐ గవర్నర్ నోటి నుంచి వచ్చి 0.5శాతం రెపోరేటు తగ్గింపుతో నెలకు రూ.823 ఆదా అవుతుంది. సాధారణంగా బ్యాంకులు వడ్డీలు తగ్గింపు నిర్ణయం కారణంగా ఈఎంఐ మొత్తాన్ని తగ్గించవు. కానీ.. పరిమిత కాలాన్ని తగ్గిస్తాయి. దీని వల్ల వెనువెంటనే ప్రయోజనం కంటికి కనిపించకున్నా.. మొత్తంగా తగ్గింపు ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

అయితే.. ఇక్కడో లెక్క ఉంది. రఘురాం రాజన్ నోటి వెంట రెపోరేటు తగ్గింపు మాట వచ్చిన వెంటనే అన్నీ బ్యాంకులు దీన్ని అమలు చేస్తాయన్నది లేదు. ఉదాహరణకు మంగళవారం ఆర్ బీఐ  ప్రకటన వెంటనే గృహ రుణాల మీద వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకుంటూ ఎస్ బీఐ.. ఆంధ్రాబ్యాంకు.. బ్యాంక్ ఆఫ్ ఇండియాలు మాత్రమే తగ్గించటం గమనార్హం. ఇక.. గవర్నర్ ప్రకటించిన 0.5శాతానికి కాను.. ఎస్ బీఐ 0.4శాతం తగ్గిస్తే.. ఆంధ్రా బ్యాంక్ 0.25శాతం.. బ్యాంక్ ఆఫ్ ఇండియాలు 0.25 శాతం మాత్రమే తగ్గించాయి. దేవుడు వరం ఇవ్వగానే సరికాదు.. పూజారి కూడా కరుణించాలన్నది బ్యాంకుల విషయంలో నూటికి నూరు శాతం నిజం.
Tags:    

Similar News