అర్జెంట్ గా రూ.100 నోట్లు ప్రింట్ చేయాల‌ట‌

Update: 2018-05-07 04:51 GMT
ఏ ముహుర్తంలో మోడీ మాష్టారి మ‌న‌సులో పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం తీసుకోవాల‌ని డిసైడ్ అయ్యారో.. ఆ రోజు నుంచి సామాన్యుడు.. సంప‌న్నుడ‌న్న తేడా లేకుండా దెబ్బ మీద దెబ్బ ప‌డుతోంది. సంప‌న్నుడితో పోలిస్తే సామాన్యుడికే పెద్ద నోట్ల ర‌ద్దు భారీ షాక్ ను ఇచ్చింద‌ని చెప్పాలి. పెద్ద‌నోట్ల ర‌ద్దు వెంట‌నే న‌గ‌దుర‌హిత లావాదేవీల‌ను ప్రోత్స‌హించ‌టానికి ట్రై చేసిన‌ప్ప‌టికీ.. దాని కార‌ణంగా లాభం కంటే ఇబ్బందులే ఎక్కువ‌న్న విష‌యం చాలా త్వ‌ర‌గా జ‌నాల‌కు అర్థ‌మైపోయింది. న‌గ‌దు ర‌హిత లావాదేవీల్ని పెంచేందుకు వీలుగా మోడీ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకోక‌పోవ‌టంతో.. పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌యోజ‌నం సామాన్య ప్ర‌జ‌ల‌కు చేర‌ని ప‌రిస్థితి.

పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం తీసుకొని ఏడాదిన్న‌ర దాటిన త‌ర్వాత కూడా నోట్ల కొర‌త అంత‌కంత‌కూ పెర‌గ‌ట‌మే త‌ప్పించి త‌గ్గ‌ని దుస్థితి నెల‌కొంది. మొన్న‌టి వ‌ర‌కూ రూ.2వేల నోట్ల కొర‌త భారీగా ఉండ‌గా.. ఇప్పుడు రూ.100నోట్ల కొర‌త పెరిగిపోతోంది. బ్యాంకుల‌కు రూ.200నోట్లు.. రూ.2వేల నోట్లు వ‌స్తున్నాయి కానీ రూ.వంద నోట్లు మాత్రం రావ‌టం లేద‌ని బ్యాంకర్లు చెబుతున్నారు.

వ‌చ్చిన కొద్దిపాటి వంద‌నోట్లు కూడా పాత‌వే వ‌స్తున్నాయ‌ని.. 2005 కంటే ముందుగా ప్రింట్ అయిన నోట్లు మాత్ర‌మే వ‌స్తున్నాయ‌ని.. వాటిని ఏటీఎంలో పెట్టినంత‌నే చిరిగిపోతున్నాయ‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికైనా ఆర్ బీఐ క‌ళ్లు తెరిచి వంద రూపాయిల నోట్ల‌ను వెంట‌నే ప్రింట్ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. వంద నోట్ల ప్రింట్ చేసే విష‌యంలో ఏ మాత్రం ఆల‌స్యం చేసినా.. చిన్న‌నోట్ల కొర‌త విరుచుకుప‌డే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని చెబుతున్నారు. రూ.100నోట్ల కొర‌త పెరిగిన ప‌క్షంలో.. అదో సంక్షోభంగా మారి రూ.500 నోట్ల మీద తీవ్ర ఒత్తిడి ప‌డటం ఖాయ‌మ‌ని హెచ్చ‌రిస్తున్నారు. మ‌రి.. రూ.వంద నోట్ల ప్రింటింగ్‌ విష‌యంలో ఆర్ బీఐ వెనువెంట‌నే నిర్ణ‌యం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News