ఆఖరి బంతికి ఆర్‌సీబీ అద్భుత విజయం .. లాస్ట్ బాల్ సిక్స్ కొట్టిందెవరంటే !

Update: 2021-10-09 10:48 GMT
ఐపీఎల్ 2021లో శుక్రవారంతో లీగ్ దశలో డబుల్ రౌండ్ రాబిన్ మ్యాచ్‌లు ముగిశాయి. లీగ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓకే రోజు ఓకే సమయంలో రెండు మ్యాచ్‌లు నిర్వహించారు. ఒకపైపు ముంబై ఇండియన్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతుండగానే.. అదే సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మరో మ్యాచ్ జరిగింది. అయితే ముంబై ఇండియన్స్ బ్యాటర్లు వీర విధ్వంసం సృష్టించడం, సన్‌రైజర్స్ హైదరాబాద్ అంతే ధీటుగా సమాధానం ఇస్తుండటంతో వేరే మ్యాచ్ చాలా తక్కువ మంది చూశారు. ఇక్కడ ముంబై చేతిలో ఒక తెలుగు జట్టు ఓడిపోతుండగా అదే సమయంలో ఒక తెలుగు క్రికెటర్ బెంగళూరుకు అద్బుత విజయాన్ని అందించాడు. శుక్రవారం అత్యధిక మంది బెంగళూరు ఫినిషింగ్‌ ను చూడలేక మిస్ అయ్యారు.

చివరి బంతికి సిక్స్ కొట్టి బెంగళూరు బ్యాటర్ కేఎస్ భరత్ మ్యాచ్ గెలిపించడాన్ని చూడలేక పోవడంతో.. అందరూ హైలైట్స్ కోసం ఎగబడ్డారు. అదే సమయంలో అసలు ఈ తెలుగు వాడైన కేఎస్ భరత్ ఎవరో తెలుసుకోవడానికి గూగుల్‌లో పెద్ద ఎత్తున సెర్చ్ చేశారు. కేఎస్ భరత్ పూర్తి పేరు కోనా శ్రీకర్ భరత్. ఆంధ్రప్రదేశ్‌ లోని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం అనే గ్రామంలో 1993 అక్టోబర్ 3న జన్మించాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్‌పై విపరీతంగా ఇష్టం పెంచుకున్న శ్రీకర్ భరత్, దాన్నే కెరీర్‌గా కొనసాగించాలని ఫిక్స్ అయిపోయాడు. ఆంధ్రా క్రికెట్ జట్టుకు తొలి సారిగా 2012లో ఎంపికయ్యాడు. భరత్ మొదట కేవలం బ్యాటర్‌గానే ఉన్నాడు. అయితే అతడి కోచ్ భరత్‌ లోని ఫీల్డింగ్ స్కిల్స్ చూసి కీపింగ్ వైపు దృష్టిపెట్టమని సలహా ఇచ్చాడు.

దీంతో కేఎస్ భరత్ కీపింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డా.. త్వరగానే కీపింగ్‌ కు అలవాటు పడ్డాడు. ఆంధ్రా క్రికెట్ జట్టుకు కూడా వికెట్ కీపర్‌ గానే స్థానం దక్కించుకున్నాడు. అలా కీపింగ్ భరత్‌ కు అవకాశాలను తెచ్చిపెట్టింది. 2015లో ఆంధ్రా జట్టుకు రంజీ ట్రోఫీలో ప్రాతినిధ్యం వహించాడు. ఆ ఏడాది ఏకంగా ట్రిపుల్ సెంచరీ చేశాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ట్రిపుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి వికెట్ కీపర్ బ్యాటర్‌గా కేఎస్ భరత్ రికార్డు సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ లో 69 మ్యాచ్‌లు ఆడి 3909 పరుగులు చేశాడు. ఇక కేఎస్ భరత్ తొలి సారిగా 2019లో భారత టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. బంగ్లాదేశ్‌ తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ సిరీస్‌ లో వృద్దిమాన్ సాహకు బ్యాకప్‌గా కేఎస్ భరత్‌ ను ఎంపిక చేశారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పర్యటనల్లో కూడా కేఎస్ భరత్‌ కు రిజర్వ్ కీపర్‌ గా చోటు దక్కింది. కానీ ఇంత వరకు భారత జట్టుకు డెబ్యూ మ్యాచ్ ఆడలేదు.

ఐపీఎల్‌లో 2015లో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని కొనుగోలు చేసింది. కానీ ఆ సీజన్‌లో భరత్‌ కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం లేదు. 2021లో భరత్‌ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ. 10 లక్షలకు కొనుగోలు చేసింది. ఆర్సీబీ తరపున అరంగేట్రం చేసిన దగ్గర నుంచి నిలకడగా ఆడుతున్నాడు. తనలోని అద్బుతమైన మ్యాచ్ విన్నింగ్ బ్యాటర్ ఉన్నాడని శుక్రవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌ లో నిరూపించాడు. కేవలం 52 బంతుల్లో 78 పరుగులు చేసిన భరత్, ఆఖరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించడంతో ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. కెప్టెన్ కోహ్లీ డ్రెస్సింగ్ రూం నుంచి మైదానంలోకి పరిగెత్తుకొని వచ్చి భరత్‌ను గట్టిగా హగ్ చేసుకున్నాడు.


Tags:    

Similar News