మహారాష్ట్రలో మళ్ళీ ఎన్నికలా ..?

Update: 2019-11-05 18:00 GMT
గిన్నె లో ఉన్న అన్నం నోట్లోకి చేరలేదు అంటే ఇదేనేమో అని మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులని చూస్తే  అనిపించకమానదు. ఎందుకు అంటే ఎన్నికల ముందు అన్ని పార్టీలు కూడా పొత్తుల తో బరిలోకి దిగి .. ఎవరి బలం మేర వారు సీట్లని గెలుచుకున్నారు. ముఖ్యంగా శివసేన - బీజేపీ కూటమి .. రాష్ట్రంలో పోటీ చేసిన 288 స్థానాలకు గాను  161 సీట్లు గెలుచుకుంది. ఇందులో బీజేపీ 105 సీట్లు, శివసేన 56 సీట్లు గెలిచింది. ఒకవేళ పొత్తుల తో బరిలో కి దిగకపోతే ఎవరి పరిస్థితి ఎలా ఉండేదో ఏమో కానీ , ఈ పొత్తులతో  ఎన్నికల ఫలితాలు వచ్చిన కూడా మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నుండి మాత్రం బయట పడలేక పోతుంది.

దీనికి ప్రధాన కారణం శివసేన 50 -50 పార్ములా కింద ముఖ్యమంత్రి పదవి చెరో రెండున్నరేళ్లు పంచుకోవాల్సిందే అని పట్టుబడటమే. మహారాష్ట్రలో కింగ్ మేకర్ గా నిలిచిన శివసేన తమకి అందివచ్చిన అవకాశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోవడానికి సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది . అలాగే బీజేపీ కూడా అధికారాన్ని పంచుకోవడానికి సిద్ధంగాలేదు. దీనితో ఈ వ్యవహారం ఎంతకీ  తెగడంలేదు. ఈ సమయంలో త్వరలో మహారాష్ట్ర లో  సర్కారు ఏర్పాటవుతుందని దేవేంద్ర ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేస్తున్నా, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ జోక్యం చేసుకోవాలని శివసేన నేత లేఖ రాయడం ఇప్పుడ  కలకలం రేపుతోంది.  

అలాగే గవర్నర్ తో వరుస భేటీలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అటు శివసేన ముఖ్య నేతలు సంజయ్‌ రౌత్‌, రాందాస్‌ కదం గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీని కలువగా అటు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారు. ఈ వ్యవహారం పై సోనియా తో మాట్లాడిన పవార్ ప్రతిపక్షం లో కూర్చోవడానికి మేము సిద్ధం అంటూ తెలిపాడు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అనంతరం సంజయ్‌ రౌత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మెజారిటీ ఎవరికి ఉంటే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చునని రౌత్‌ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ కూడా బీజేపీ నాయకత్వంతో చర్చించారు.  సీఎం పదవి పంచే ప్రసక్తే లేదని, అయితే ఇప్పటికే సంకీర్ణ ప్రభుత్వం విషయంలో శివసేనకు డోర్లు తెరిచే ఉన్నాయని బీజేపీ నేతలు అంటున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని పంపిస్తే.. ఈ సమస్యను రెండు గంటల్లో పరిష్కరిస్తారని చెప్పడం  కూడా చర్చనీయాంశమైంది. ఒకవేళ శివసేన అధికారం పట్టు విడవకపోతే , మళ్ళీ  ఎన్నికలకి వెళ్లడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. దీనితో ఇప్పుడు బంతి శివసేన కోర్ట్ లో ఉంది. చూడాలి శివసేన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ..
Tags:    

Similar News