హైకోర్టుకు చేరిన‌.. వీర‌బ్ర‌హ్మం మ‌ఠం వివాదం!

Update: 2021-06-30 09:30 GMT
క‌డ‌ప జిల్లాలోని వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ఎవ‌రికి ద‌క్కాల‌నే విష‌య‌మై కొన్ని రోజులుగా కొన‌సాగుతున్న‌ వివాదం మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. ఇన్నాళ్లూ మ‌ఠాధిప‌తిగా ఉన్న వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి గత నెలలో మరణించారు. దీంతో.. ఆయ‌న ఇద్ద‌రు భార్య‌ల కుమారులు వార‌స‌త్వం కోసం పోటీ ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే.

నాలుగు రోజుల క్రితం దేవాదాయ శాఖ‌, స్థానిక ఎమ్మెల్యే ఆధ్వ‌ర్యంలో రాజీ చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఈ చ‌ర్చ‌ల ప్ర‌కారం.. పీఠాధిప‌తిగా పెద్ద భార్య కుమారుడు వెంట‌క‌టాద్రి స్వామి, ఉత్త‌రాదికారిగా రెండో కుమారుడు వీర‌భ‌ద్రస్వామిని ఎన్న‌కున్నారు. దీనికి రెండో భార్య మారుతి మ‌హాల‌క్ష్మి కూడా అంగీక‌రించారు. కానీ.. ఆమె ఇప్పుడు హైకోర్టును ఆశ్ర‌యించ‌డం గ‌మ‌నార్హం.

ఈ రాజీ చ‌ర్చ‌ల్లో త‌న‌ను ఒత్తిడి చేసి అంగీక‌రించేలా చేశార‌ని ఆమె హైకోర్టుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు.. పిఠాధిప‌తి నియామ‌కం అనేది వీలునామా ప్ర‌కారమా? లేదా కుటుంబ స‌భ్యుల ఒప్పందం ప్ర‌కారమా? అనేది తేల్చాల‌ని కోరారు. వీలునామా ప్ర‌కార‌మే అయితే మాత్రం.. త‌న కుమారుడికే వార‌స‌త్వం ద‌క్కాల‌ని కోరుతున్న‌ట్టు పేర్కొన్నారు.

దీంతో.. ఈ వివాదం మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చిన‌ట్టు అయ్యింది. వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి చ‌నిపోయిన నాటినుంచి ఈ వివాదం కొన‌సాగుతూనే ఉంది. ఎంతో మంది పీఠాధిప‌తులు ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేసినా.. ఇద్ద‌రు భార్య‌ల కుమారుల్లో ఎవ్వ‌రూ మెట్టు దిగ‌లేదు. నాలుగు రోజుల క్రితం జ‌రిగిన చ‌ర్చ‌ల‌తో సుఖాతం అయ్యింద‌ని భావించ‌గా.. ఇప్పుడు హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో మ‌ళ్లీ గ‌త ప‌రిస్థితే ఏర్ప‌డింది.


Tags:    

Similar News