ఇదే.. వైజాగ్ వారి ఫ‌స్ట్ డే అనుభ‌వం

Update: 2017-05-02 06:19 GMT
సాఫీగా సాగిపోయే వాటిని స‌రికొత్త విధానాలంటూ ర‌చ్చ ర‌చ్చ చేసే య‌వ్వారాలు అప్పుడ‌ప్పుడు చేస్తుంటారు. తాజాగా నిన్న‌టి నుంచి అలాంటిదే ఒక‌టి షురూ అయ్యింది. దేశ వ్యాప్తంగా ఐదు ప‌ట్ట‌ణాలు క‌మ్ ఓ మోస్త‌రు న‌గ‌రాల్లో నిన్న‌టి నుంచి పెట్రోల్ బంకుల్లో పెట్రోల‌.. డీజిల్ ధ‌ర‌ల్ని ఏ రోజుకు ఆ రోజు మార్చేసే కొత్త ప్ర‌క్రియ‌ను షురూ చేసిన సంగ‌తి తెలిసిందే.

దీనికి సంబంధించిన ఫీడ్ బ్యాక్ వ‌చ్చేసింది. దేశంలోని పెట్రోల్ బంకుల్లో నెల‌కు రెండు ద‌ఫాలు చొప్పున పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లపై స‌మీక్ష జ‌రిపి నిర్ణ‌యం తీసుకోవ‌టం జ‌రుగుతున్న‌దే. నెల‌కు రెండు సార్లు ఏంటి? రోజూ మార్చేస్తే ఎంత బాగుండు? అన్న చిత్ర‌మైన ఆలోచ‌న ఎవ‌రి బుర్ర‌లో వ‌చ్చిందో కానీ.. మొత్తమ్మీదా మేథోమ‌ధ‌నం జ‌రిపి.. దేశ వ్యాప్తంగా ఐదు ప‌ట్ట‌ణాల్లో ఈ విధానాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు చేయాల‌ని డిసైడ్ చేశారు.

ఈ కొత్త విధానం అమ‌ల్లోకి వ‌చ్చిన నేప‌థ్యంలో.. ఫ‌స్ట్ డే అనుభ‌వం గురించి అటు వినియోగ‌దారులు.. ఇటు పెట్రోల్ బంకుల వారు త‌మ అనుభ‌వాల్ని చెప్పుకొచ్చారు. ఏ రోజుకు ఆ రోజు పెట్రోల్.. డీజిల్ ధ‌ర‌ల్లో మార్పుల వ‌ల్ల‌.. ఏ రోజు ఎంత‌న్న విష‌యం మీద అవ‌గాహ‌న త‌క్కువ‌గా ఉండ‌ట‌మే కాదు.. పెట్రోల్ బంకుల వారు ఎక్కువ దోచేస్తున్న భావ‌న‌ను ప‌లువురు వినియోగ‌దారులు వ్య‌క్తం చేస్తున్న‌ట్లుగా పెట్రోల్ బంకుల వారు వాపోతున్నారు. పెట్రోల్ ధ‌ర‌ల మీద ఎప్పుడూ లేని విదంగా ప‌లువురితో అదే ప‌నిగా వివ‌రించాల్సి వ‌స్తోంద‌ని చెబుతున్నారు.

బంకుకు వచ్చినవారంతా...అదేంటి...నిన్న తక్కువుంది కదా...ఇప్పుడేంటిలా? అని అనుమానంగా ప్రశ్నిస్తున్నారని వాపోతున్నారు. అమ్మ‌కాల కంటే కూడా ధ‌ర గురించి అడ‌గ‌ట‌మే ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు. పెట్రోల్ బంకుల య‌జ‌మానుల వాద‌న ఇలా ఉంటే.. విన‌యోగ‌దారుల వాద‌న మ‌రోలా ఉంది. అంతా ప‌ద్ధ‌తి ప్రకార‌మే చేస్తున్న‌ట్లు క‌నిపించే పెట్రోల్ బంకుల్లో రెప్ప మాటున సాగే అక్ర‌మాల నేప‌థ్యంలో రోజుకో ధ‌ర అంటే న‌మ్మేదెలా? అన్న సందేహాన్ని ప‌లువురు వినియోగ‌దారులు వ్య‌క్తం చేస్తున్నారు.

నెల‌కు రెండుసార్లు ధ‌ర‌ల్ని స‌మీక్షించే విధాన‌మే స‌రైంద‌ని.. ఆ ప‌ద్ధ‌తినే కొన‌సాగిస్తే లేనిపోని అనుమానాలు ఉండ‌వ‌ని.. మోసానికి గురయ్యే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంద‌ని చెబుతున్నారు. మ‌రి.. జ‌నాల ఈతి బాధ‌లు ఏసీ రూముల్లో ఉండి నిర్ణ‌యాలు తీసుకునే అధికారుల దృష్టికి వెళ‌తాయంటారా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News